ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ దర్శక ధీరుడికి బాక్సాఫీసు దగ్గర ఎదురే లేదు. అపజయం ఎరుగని ప్రయాణం జక్కన్నది. సినిమా సినిమాకీ తన స్థాయి పెంచుకోవడమే కాదు, టాలీవుడ్ మార్కెట్నీ కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. బాహుబలితో రాజమౌళి ఖ్యాతి విశ్వ వ్యాప్తమైంది. వెండి తెరపై కథల్ని ఆవిష్కరించడంలో రాజమౌళి శైలి విభిన్నం. ఎత్తుగడ, ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేవిధానం అపూర్వం. ఈ విషయంలో రాజమౌళికి అంత పట్టు ఎక్కడి నుంచి వచ్చింది? రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈ విషయం గురించి జక్కన్న దగ్గర ప్రస్తావిస్తే ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
చిన్నప్పుడు రాజమౌళికి కథలు వినే అలవాటు బాగా ఉండేదట. తాతయ్య తన దగ్గర కూర్చుని జానపద కథల్ని, ఇతిహాసాల్నీ వల్లించేవారట. ఆకథ చెప్పే పద్ధతి కూడా వినూత్నంగా ఉండేదట. తాతయ్య కథల్ని తనదైన శైలిలో విశ్లేషించుకొంటూ… ఊహించుకొనేవాడట. అప్పటి నుంచీ విజువల్ సెన్స్ కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా గొప్ప కథకుడు కావడం రాజమౌళికి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఆ కథల్నే రాజమౌళి వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడన్నమాట.