కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులోని కరుణానిధి నేతృత్వంలో నడుస్తున్న డి.ఎం.కె. పార్టీతో పొత్తులు పెట్టుకొంది. సోనియా గాంధీ రేపు కరుణానిధితో కలిసి చెన్నైలో వి.ఓ.సి. మైదానంలో జరుగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ ఈనెల ఏడవ తేదీన మధురై, కోయంబత్తూరు నగరాలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. వీలయితే తిరునెల్ వెలి, నాగర్ కోయీల్ లో కూడా డి.ఎం.కె.తో కలిసి ప్రచారంలో పాల్గొనవచ్చునని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఇలాంగోవన్ మీడియాకి తెలిపారు.
ఈ ఎన్నికలలో అధికార అన్నాడిఎంకె, తమిళ సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలో డిఎండికె కూటమి, కాంగ్రెస్-డి.ఎం.కె. కూటమి, భాజపా పోటీ పడుతున్నాయి. పోటీ ప్రధానంగా అన్నాడిఎంకె, డిఎంకె మద్యనే ఉండవచ్చని తెలుస్తోంది. జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీకి విజయావకాశాలున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కానీ తమిళనాడులో ఆనవాయితీ ప్రకారం ప్రతీ ఐదేళ్ళకి ఒకమారు డిఎంకె-అన్నాడిఎంకె పార్టీలకు ప్రజలు అధికారం కట్టబెడుతుంటారు. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి డిఎంకెకి అధికారం దక్కవచ్చునని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు.
దానికి బలమయిన కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసింది కనుక దాని విజయావకాశాలు ఇంకా మెరుగవ్వాలి. కానీ సరిగ్గా ఇదే సమయంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం బయటపడటం, అందులో సోనియా, రాహుల్ గాంధీలే ప్రధాన నిందితులని భాజపా ఆరోపణలు చేయడం, దానిపై పార్లమెంటులో రగడ, మీడియాలో వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిద్దరూ ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్-డిఎంకె కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే, అది ప్రత్యర్ధులకు వారి కూటమిని ఎండగట్టేందుకు మంచి అవకాశం కల్పించినట్లవుతుంది. అగస్టా కుంభకోణం బయటపడకపోయుంటే, డి.ఎం.కె పార్టీకి కాంగ్రెస్ పొత్తులు ఎంతో మేలు చేకూర్చేవి కానీ ఇప్పుడు దాని వలెనే నష్టపోయే అవకాశం కనబడుతోంది.
ఈ ఎన్నికలలో ఏకాకి అయిపోయిన భాజపాకి గౌరవప్రదమయిన సీట్లు గెలుచుకొనే అవకాశం ఎలాగూ లేదు కనుక తను గెలవలేకపోయినా కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు ఆ అంశాన్ని గట్టిగా ప్రచారం చేయకుండా ఊరుకోదు. మిగిలిన పార్టీలు కూడా అదే విషయం హైలైట్ చేయకమానవు. ఇంకా రాహుల్ గాంధీ అపరిపక్వ ప్రసంగాల వలన వారి కూటమికి లాభం కంటే నష్టం జరిగే అవకాశాలే ఎక్కువున్నాయి.