హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించబోతున్నారు. దసరా సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొందరు నేతల పనితీరుపై సీఎమ్ బాగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఉద్వాసన పలకటంతోబాటు సామాజికవర్గాల నిష్పత్తిలోని అసమానతలను పూడ్చాలని బాబు యోచిస్తున్నారని సమాచారం.
ముస్లిమ్‌లకు ప్రస్తుతం క్యాబినెట్‌లో ప్రాతినిధ్యంలేదు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎమ్.ఎ.షరీఫ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఎస్‌టీ సామాజికవర్గానికికూడా ఇప్పుడు ప్రాతినిధ్యంలేదు. ఈ వర్గంలో పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌నుగానీ, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంధ్యారాణినిగానీ తీసుకోనున్నట్లు తెలిసింది. సంధ్యారాణికి మంత్రి నారాయణ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలిగే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడువంటి నేతలు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినందున వారిని ఇటీవల ఎమ్మెల్సీలుగా తీసుకున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం రేసులో వీరు ముగ్గురు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రల పేర్లు బాగా వినబడుతున్నాయి.
అయితే పయ్యావులకుమాత్రం సామాజికవర్గం సమీకరణం అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురంజిల్లాలో ప్రస్తుతం మంత్రిగా చేస్తున్న పరిటాలసునీత, పయ్యావుల కేశవ్ కూడా ఒకే సామాజికవర్గం కావటంతో అదే పయ్యావులకు అడ్డుగా నిలుస్తోందంటున్నారు. దానికితోడు ఇదే జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డికూడా ఓసీ వర్గం వారే కావటంతో ఇప్పుడు పయ్యావులకు ఇస్తే సమీకరణాలు మారతాయేమోనని ఆలోచిస్తున్నట్లు భోగట్టా. మరోవైపు పయ్యావుల, గాలి, ధూళిపాళ్ళ నరేంద్రలకు స్థానంకల్పిస్తే సామాజికవర్గంపరంగా మళ్ళీ అసమానతలు ఏర్పడతాయేమోనని ఒక వాదన. ఇటీవల ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చిన రాజేంద్రప్రసాద్, గాలి, పయ్యావుల ఒకే సామాజికవర్గం(కమ్మ) కావటాన్ని ఇప్పటికే కొందరు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో చంద్రబాబు సమతుల్యం ఎలా సాధిస్తారో చూడాలి. మరోవైపు ఉత్తరాంధ్రలో కళావెంకట్రావు(కాపు)కు ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చింది ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవటానికేనంటున్నారు. ఒకవేళ ఆయనకు మంత్రిపదవి ఇస్తే ఆయనకు బంధువైన మృణాళినిని తప్పిస్తారు. ఉద్వాసన విషయానికొస్తే, ఇటీవల చేయించిన సర్వేలో చాలా తక్కువ మార్కులు వచ్చిన మంత్రులపై సీఎమ్ బాగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మరి వారిని తప్పిస్తారా, శాఖలు మారుస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతపరిస్థితులలో మంత్రిపదవులనుంచి ఎవరినైనా తప్పించేటంత సాహసం బాబు చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఏపీలో మొత్తం 175మంది ఎమ్మెల్యేలున్నారు కాబట్టి మొత్తం 25మంది మంత్రులను తీసుకోవచ్చు. ప్రస్తుతం 19మంది మంత్రులున్నారు కాబట్టి ఇంకా ఐదారుగురిని తీసుకోటానికి అవకాశమైతే ఉంది. దసరాకి అమరావతి శంకుస్థాపన చేయించాలని బాబు యోచిస్తున్నారు. ఈలోపుగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి దసరానుంచి పనులు వేగవంతం చేయాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.