తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మిగిలిన 11 మంది ఎమ్మెల్యేల్లో చివరిదాకా అదే పార్టీలో ఎందరు మిగులుతారు? ఎందరు గులాబీ తీర్థం పుచ్చుకుని.. అధికార పార్టీలో చేరిపోతారు? అనేది ఇప్పుడు సస్పెన్స్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇది విపరీతమైన చర్చనీయాంశంగా ఉంది. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరిని గులాబీ పార్టీలో కలిపేసుకోబోతున్నాం అని కొన్ని వారాల కిందటే ఆ పార్టీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు కాంగ్రెస్ను అంటిపెట్టుకున్న పెద్దల్లో గుబులు రేగుతోంది. ఎవరెవరు వెళ్లే అవకాశం ఉన్నదో ఊహించుకుని వారిని బుజ్జగించడానికి కాంగ్రెస్ పెద్దలు తాపత్రయ పడుతున్నారు, అదే సమయంలో వారికి తెరాసనుంచి తాయిలాలు, ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరికి ‘తాయిలాలు- బుజ్జగింపుల’ ఆట ఆడుతున్నట్లుగా ఉన్నదని పలువురు చమత్కరిస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా చేసేయడానికి , వారిని మరింత బలహీన పరచాలని తెరాస పావులు కదుపుతున్నది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యేను తెరాసలో చేర్చుకోవడానికి తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే పుకార్లు.. కాంగ్రెస్ అగ్రనాయకుల్లో కంగారు పుట్టిస్తున్నాయి.
మిన్ను విరిగి మీద పడినప్పటికీ కాంగ్రెస్ పంచనుంచి పక్కకు మళ్లే అవకాశం లేని నాయకులు కొందరు ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. పార్టీలో తాము తప్ప మరెవ్వరూ మిగలేరేమో అనే భయం వారికి కలుగుతున్నట్లుంది. ప్రస్తుతానికి మిగిలిందే 11 మంది ఎమ్మెల్యేలు అయితే.. వారిలో కూడా ఎందరు జారిపోతారో అనే భయం ఉంది. ఈ మూడు జిల్లాల పరిస్థితి ప్రస్తుతం డబుల్ బొనాంజాలాగా కనిపిస్తోంది. ఒకవైపు తెరాసనుంచి తాయిలాలు ఆకర్షిస్తూ ఉంటే.. మరోవైపు కాంగ్రెస్ నాయకులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగానే అధికార పార్టీకి ఎడ్వాంటేజీ ఉంటుంది గనుక.. మరికొందరు ఎమ్మెల్యేల వలసలు తప్పకపోవచ్చునని, కాంగ్రెస్ మరోసారి ఫిరాయింపుల గురించి.. యాగీ చేయాల్సి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.