తనను దొంగ అనవద్దన్న విజయ్ మాల్యాను దొంగలకు దొంగ అనాలంటున్నారు ఆయన నిర్వాకానికి ఒళ్లు మండిన వారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో 7 వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. కొన్నేళ్లుగా పైసా వడ్డీ కూడా కట్టడం లేదు. మరో వైపు విందులు వినోదాలు జల్సాలు మానడం లేదు. ఆయన వైఖరి చూస్తే దివాళా తీసిన వాడిలా కాదు కావాలని రుణం ఎగ్గొట్టే వాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు అప్పిచ్చిన బ్యాంకులకు మాత్రం చాలా ఆలస్యంగా అర్థమైంది. ఉద్దేశపూర్వక ఎగవేత దారు అని ప్రకటించాలా వద్దా అని కూడా తర్జనభర్జనలు పడ్డాయి. చివరకు ఒకటి తర్వాత ఒకటిగా బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. అందరికంటే ఎక్కువ రుణమిచ్చిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరీ ఉదారంగా, మరింత ఆలస్యంగా స్పందించింది.
మాల్యాకు యునైటెడ్ స్పిరిట్స్ బోర్డు నుంచి వైదొలగినందుకు భారీగానే డబ్బు ముట్టజెప్పడానికి ఆఫర్ వచ్చింది. ఆ డబ్బు తీసుకుని లండన్ వెళ్లిపోతానని కామెంట్ చేశాడు. అప్పుడైనా బ్యాంకులు వెంటనే స్పందించలేదు. చాలా ఆలస్యంగా న్యాయ పోరాటం ప్రారంభించాయి ఈలోగా మాల్యా లండన్ కు చెక్కేశాడు.
దొంగ అనవద్దని మాల్యా మీడియాకు సలహా ఇవ్వడమే ఆశ్చర్యం. దొంగను దొంగ అనకపోతే ఏమంటారు? చెక్కుల బౌన్స్ కేసులో అతడు దోషేనని హైదరాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. ఇక శిక్ష ఖరారు చేయడమే బాకీ. ఈనెల 5వ తేదీకల్లా అతడిని తీసుకొచ్చి బోనులో నిలబెట్టాలని వారెంట్ కూడా జారీ చేసింది. కాబట్టి, కోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పైగా అతడి ప్రవర్తన అడుగడుగునా దొంగ లక్షణాలే కనిపిస్తాయి.
మొదటి నుంచీ అతడిది దొంగబుద్ధేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా వ్యాపారం కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకున్న వారు, అందులో నష్టం వచ్చినా తమకున్న ఇతర ఆదాయ మార్గాలనుంచి డబ్బు తిరిగి చెల్లిస్తారు. మాల్యా ఆ పని చేయలేదు. అతడికి ఉన్న ఇతర కంపెనీల్లో బోలెడు డబ్బులు, ఆస్తులు ఉన్నాయి. దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున స్థిర చరాస్తులున్నాయి. అవసరమైతే వాటిని అమ్మి అయినా సరే అప్పు తీరుద్దాం అని ఆయన అనుకోలేదు. పైగా వేరే కంపెనీల పేరుతో క్యాలెండర్ అమ్మాయిలతో విదేశీ షికార్లు, జల్సాలు, ఐపీఎల్ టీము పేరుతో భారీగా ఖర్చులు మానలేదు.
కింగ్ ఫిషర్ అనేది మనిషి కాదు. కాబట్టి దాని ప్రమోటర్, చైర్మనే దాని రుణానికి బాధ్యుడు అవుతాడు. అందుకే మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేతదారుగా ప్రకటించారు. అసలు ఆ సంస్థ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఎగ్గొట్టిన వాడిని ఏమని పిలవాలి? పైగా గతంలో ఉద్యోగుల జీతాల నుంచి టీడీఎస్ కింద మినహాయించిన సొమ్మును ఆదాయ పన్ను శాఖకు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ లైన్స్ పేరుతో తీసుకున్న లోన్ మొత్తంలో చాలా భాగం విదేశాలకు రహస్యాంగా తరలించాడనేది ఈడీ అభియోగం. ఈమేరకు విచారణ చేపట్టింది. దీనికి మాల్యా రాకపోడంతో అతడి పాస్ పోర్టును రద్దు చేయించింది. అరెస్టు వారెంట్ పొందింది. ఇంత జరిగినా తాను దొంగను మాల్యా అంటే, ఇక దొంగ అనే పదాన్ని అన్ని భాషల డిక్షనరీల నుంచి తొలగించాలేమో.