కర్నూలుజిల్లా రాజకీయాల్లో మరో మార్పు చోటు చేసుకోనున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 7వ తేదీన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరడానికి ఆయన ముహూర్తం నిర్ణయించుకున్నారు. మోహన్‌రెడ్డి, ఇటీవలే తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి స్వయానా బావమరిది. ఆయన భార్య దివంగత శోభా నాగిరెడ్డికి స్వయానా తమ్ముడు. ఎస్వీ మోహన్‌రెడ్డి తెదేపాలోకి రానుండడంతో భూమా బ్యాచ్ ఒక్కొక్కరుగా తెదేపాలోకి రావడానికి ప్రయత్నాలుశ్రీన /జరుగుతున్నట్లు అర్థమవుతోంది.
కర్నూలు జిల్లా వైకాపా రాజకీయాల్లో కీలక నాయకుడు అయిన భూమా నాగిరెడ్డి, కూతురు అఖిల ప్రియ సహా తెలుగుదేశంలో చేరిన రోజున.. వారి వెంట మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఫిరాయిస్తారని అంతా అనుకున్నారు. భూమా తో రాజీ చర్చలు ముగిసిన వెంటనే జగన్మోహన్రెడ్డి హుటాహుటిన కర్నూలు జిల్లాలో తన పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించి.. వారితో ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారు. పర్యవసానంగా వారంతా ప్రెస్‌మీట్ పెట్టి.. తాము వైకాపాలోనే ఉంటాం అని.. తెదేపాలోకి వెళ్లే అవకాశం లేదని ప్రకటించారు. ఆ విడత ఎమ్మెల్యేల ప్రెస్మీట్లో కీలకంగా వ్యవహరించింది ఎస్వీ మోహన్‌రెడ్డే కావడం విశేషం. కాగా ఆయనే ఇప్పుడు తెదేపాలోకి వెళ్లడానికి ముహూర్తం పెట్టుకున్నారు.
పాలమూరు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో జగన్ చేయదలచుకున్న దీక్ష గురించి తనకు సరైన రీతిలో సమాచారం ఇవ్వలేదని, తన ప్రాధాన్యానికి చెక్ పెడుతున్నారని ఆయన అలిగినట్లుగా ఈ ఫిరాయింపునకు కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో భూమా ఫ్యామిలీ వెళ్లిపోయిన తర్వాత కూడా వైకాపాలోనే ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డిని.. వచ్చే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డలో మేనకోడలు అఖిలప్రియపై పోటీ చేయడానికి జగన్ ఒత్తిడి చేస్తున్నాడని కూడా వారు అంటున్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి కానీ, ఆయన సోదరుడు కానీ అఖిలప్రియపై పోటీచేయాలని జగన్ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పార్టీని వదలిపోవడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.