ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ని మళ్ళీ ఇవ్వాళ్ళ విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత, హరీష్ రావత్ కి శాసనసభలో బలనిరూపణ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే సబబు అని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే భావిస్తున్నట్లు దాని తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీం కోర్టుకి తెలిపారు. దానిపై తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మే 6న జరిగే తదుపరి విచారణలో దాని అభిప్రాయం తమకు తెలపాలని జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆయనని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని తెలిపింది.
హరీష్ రావత్ కి శాసనసభలో బలనిరూపనకి అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు భావిస్తోంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఒకమెట్టు దిగి వచ్చి అందుకు అంగీకరిస్తున్నట్లు చెపుతోంది కనుక మే6 తరువాత ఎప్పుడయినా హరీష్ రావత్ కి ఆ అవకాశం కలుగవచ్చు. కానీ ఈలోగా తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవలసి ఉంటుంది.
ఇంతకు ముందు రాష్ట్ర హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టారు. కానీ ఆ మరునాడే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేయడంతో ఒక్కరోజులోనే ఆయన తన పదవిని కోల్పోయారు. ఆవిధంగా ఒకే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఒక రికార్డు నెలకొల్పారు. ఒకవేళ ఆయన శాసనసభలో తన మెజార్టీ నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనగలిగితే అది కూడా మరో కొత్త రికార్డే అవుతుంది.