ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో వైకాపా చాలా విచిత్రమయిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. రెండు రాష్ట్రాలలో వలసల కారణంగానే పార్టీ బలహీనపడుతోంది. రాష్ట్ర విభజన సమయంలోనే ఆ పార్టీ తెలంగాణా నుంచి దాదాపు తుడిచిపెట్టుకుపోయినా, ఇంతవరకు ఏదో పేరుకి పార్టీని నడిపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వరులు ఇద్దరూ తెరాసలో చేరిపోవడంతో తెలంగాణాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. వైకాపాని తెరాసలో విలీనం చేయమని అభ్యర్ధిస్తూ లోక్ సభ, శాసనసభ స్పీకర్లకు వారు వేర్వేరుగా లేఖలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దానితో తెలంగాణాలో వైకాపా పూర్తిగా మూతబడవచ్చు. ఈ పరిస్థితి ముందు నుంచి ఊహిస్తునదే కనుక జగన్మోహన్ రెడ్డి అందుకు బాధపడకపోవచ్చు కానీ పార్టీని నమ్ముకొన్నవారే రోడ్డున పడతారు.
తెలంగాణాలో మొదటి నుంచి కూడా వైకాపా చాలా బలహీనంగా ఉంది కనుక దానికి ఆ పరిస్థితి కలగడం అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రాలో ఎంతో బలంగా ఉంటూ, నిత్యం ప్రజా సమస్యలపై గట్టిగా ప్రభుత్వంతో పోరాడుతున్నప్పటికీ అక్కడ కూడా వలసల దెబ్బకి అంతే వేగంగా బలహీనపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు తెదేపా ఎంత కారణమో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కారకుడని చెప్పక తప్పదు.
ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై చేస్తున్న తన పోరాటాలని చంద్రబాబు నాయుడితో వ్యక్తిగత పోరాట స్థాయికి దిగజార్చేయడం వలననే ఈ సమస్య ఏర్పడిందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడిని ద్వేషించడం, విమర్శించడమే తన పార్టీ పాలసీగా మార్చేసుకోవడంతో, వైకాపా పరిధిని ఆయనే స్వయంగా కుచించివేసుకొన్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే తన అభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు, వ్యూహాలే పార్టీ విధానాలుగా మార్చేసుకొన్నారు. ఆ కారణంగా వైకాపాలో చాలా మంది సీనియర్ నేతలున్నప్పటికీ ఎవరూ ఏ ప్రజా సమస్యపై స్వయంగా పోరాడేందుకు, కనీసం మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేసారు.
దేనికయినా ఒక లిమిట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడంలో జగన్ ఆ లిమిట్స్ అన్నీ దాటేసి ఆయనని రెచ్చగొట్టడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. వైకాపా ఎమ్మెల్యేలను వలసలకు ప్రోత్సహించారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులు వారిని తెదేపా ఆహ్వానాన్ని మన్నించేలా చేశాయని చెప్పవచ్చు. ఒకవేళ వైకాపాలో మంచి రాజకీయ వాతావరణం, ప్రజాస్వామ్యం నెలకొని ఉండి ఉంటే దానికి నేడు ఈ దుస్థితి ఎదురయ్యేది కాదేమో? ఈ సమస్య నుంచి పార్టీని బయటపడేయటానికి జగన్ డిల్లీ వెళ్లి వచ్చారు. రాగానే తెలంగాణా ప్రాజెక్టులపై నిరాహార దీక్షకి సిద్దం అవుతున్నారు. నేటికీ వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడటం గమనిస్తే, ఆయన డిల్లీ యాత్ర వలన ఆశించిన ఫలితం రాలేదని అర్ధమవుతోంది. తెలంగాణాలో పార్టీ మూసుకుపోవడంతో కర్నూలులో చేయబోయే దీక్ష కూడా బెడిసికొట్టిందని అర్ధమవుతోంది.