విజయమాల్యా ఎపిసోడ్ రకరకాల మలుపులు తిరుగుతున్నది. రాజకీయ జీవితంనుంచి రాజ్యసభ నుంచి ఆయన నిష్క్రమణం అత్యంత అవమానకరమైన రీతిలోనే జరిగేలా రంగం సిద్ధం అయింది. మీడియాలో ఏదో రాస్తేనే.. ‘ఎగవేత దారు’ అని వ్యవహరిస్తేనే తీవ్రంగా ఉడుక్కుంటున్న విజయమాల్యాను రాజ్యసభ నుంచి అత్యంత అవమానకరమైన రీతిలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సభ తీర్మానించనున్నది. ఏ అవమానాన్ని తప్పించుకోవడానికి రెండు రోజుల ముందే రాజీనామాలేఖను విజయమాల్యా ఫ్యాక్స్ ద్వారా పంపారో… ఆ అవమానం ఆయనకు అనివార్యం అవుతున్నది. ఆయన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తిరస్కరించారు. ఫార్మాట్లో లేదని, సంతకం కూడా సరిపోలలేదని దానిని తిరస్కరించారు. ఈలోగా రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సిఫారసు చేసింది.
విజయమాల్యా రాజ్యసభ సభ్యత్వం ఒక కొలిక్కి వచ్చేసింది. బ్యాంకులకు 9000 కోట్లు ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌కు పారిపోయిన విజయమాల్యా ఇప్పట్లో తాను భారత్‌కు తిరిగి రాలేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఆయనను తిరిగి భారత్ రప్పించడానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎంపీ పదవిని రద్దు చేయడానికి రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ఇదివరే తీర్మానించింది. అయితే ఈ ఎథిక్స్ కమిటీ తమ ప్రతిపాదనను సభలో పెట్టేలోగా.. ఉద్వాసన కాకుండా తానే తప్పించుకోవాలని ఆయన రాజీనామా లేఖను పంపారు. తన మీద ఉన్న ఆర్థిక నేరాల గురించి కూడా ఆ లేఖలో వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే లేఖలోని విషయాలతో రాజ్యసభ ఛైర్మన్ మాత్రం ఏకీభవించలేదు. రాజీనామాను తిరస్కరించారు.
ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయబోతున్నారు. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఆయన సభ్యత్వ రద్దు గురించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విధంగానే, ఈ తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెడితే.. సభ ఏకగ్రీవంగా ఆమోదించవచ్చననే అంతా అనుకుంటున్నారు.