హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాతాలోకి మరో యాడ్ కాంట్రాక్ట్ వచ్చి చేరింది. భారతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీసంస్థ ఇంటెక్స్ తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ప్రచారకర్తగా మహేష్‌బాబును నియమించుకుంది. తెలుగు రాష్ట్రాలకుగానూ తమ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. మొబైల్ వ్యాపారంద్వారా ఈ ఏడాది 8,000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నామని, మరో మూడు-నాలుగు నెలల్లో గ్రేటర్ నొయిడా ప్లాంట్‌నుంచికూడా తయారీ మొదలవుతుందని వివరించారు. మహేష్ ద్వారా తమ ఫోన్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌బాబు, ఇంటెక్స్ అందరికీ అందుబాటు ధరలలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోందని, ఈ సంస్థతో చేతులు కలపటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అభిమానులతోబాటు తానుకూడా శ్రీమంతుడు విడుదలకోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. యథావిధిగా ప్రతి పబ్లిక్ ఫంక్షన్‌కూ వచ్చినట్లే ఈ ఫంక్షన్‌కూ అదే డార్క్ బ్లూ కలర్ షర్టే వేసుకుని వచ్చారు మహేష్. మొత్తానికి ఇటు సినిమాలు, అటు ఎడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా రెండుచేతులా సంపాదిస్తున్నారు ప్రిన్స్. అన్నట్లు ఈ బ్రాండ్‌కు ఉత్తరాదిన బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ వ్యవహరిస్తున్నారు.