పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. పటాస్ తరవాత.. నందమూరి బాలకృష్ణతో రావిపూడి ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే.. వెంటనే సుప్రీమ్ పనుల్లో పడిపోవడంతో బాలయ్య సినిమా ఉత్తిదే అనుకొన్నారంతా. కానీ.. బాలయ్యతో సినిమా ఉందని, ఎప్పటికైనా అది పట్టాలెక్కడం ఖాయమని అంటున్నాడు అనిల్ రావిపూడి. ”బాలకృష్ణగారికి ఓ లైన్ వినిపించా. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఏప్రిల్‌లోగా పూర్తి కథ సిద్ధం చేసుకొని రా అన్నారు. కానీ సుప్రిమ్ సినిమా వల్ల ఆలస్యమైంది. సుప్రిమ్ విడుదల తరవాత బాలయ్యగారి కథపై కూర్చుంటా. కథ రెడీ చేసుకొన్నాకే ఆయన్ని కలుస్తా” అంటున్నాడీ యంగ్ డైరెక్టర్. అంటే… బాలయ్యతో సినిమా చేయడం ఖాయమన్నమాట.
బాలయ్య కోసం ‘రామారావుగారూ’ అనే కథని సిద్ధం చేసుకొంటున్నాడు అనిల్. అది.. రాజకీయ వ్యంగాస్త్రమని తెలుస్తోంది. పైగా అన్న రామారావు పేరుంది కాబట్టి.. బాలయ్య సెంటిమెంట్‌ని బాగా నమ్ముతారు కాబట్టి… టైటిల్‌ని చూసైనా ఆయన టెమ్ట్ అవ్వక తప్పదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దృష్టంతా సుప్రీమ్పైనే ఉంది. రేపు (గురువారం) ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇది కూడా హిట్టయితే.. పెద్ద హీరోల దృష్టి అనిల్‌పై పడడం ఖాయం.