ఇంతవరకు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ కె.ఎం. జోసెఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ఆయన నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనమే విచారించి సంచలన తీర్పు చెప్పింది. రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. హరీష్ రావత్ శాసనసభలో తన మెజార్టీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా అంతవరకు ఆయన తన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించింది.
జస్టిస్ కె.ఎం. జోసెఫ్ ఆ కేసుపై తీర్పుని వెలువరిస్తూ, బలమయిన కారణాలు ఏవీ లేకుండానే రాష్ట్రపతి పాలన విధించినందుకు కేంద్రాన్ని తప్పు పట్టారు. ఈ విషయంలో రాష్ట్రపతి కూడా తప్పుడు నిర్ణయం తీసుకొన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్రపతి పాలన విదించడానికి సిఫార్సు చేస్తూ గవర్నర్ వ్రాసిన లేఖలో తప్పులను ఎత్తి చూపి వాటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి తప్పుడు సమాచారం అందించిందని, ఆయన కూడా తప్పు నిర్ణయం తీసుకొనేందుకు కారణమయ్యిందని చెపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన కొంచెం గట్టిగానే మొట్టికాయలు వేశారని చెప్పవచ్చు. ప్రతిపక్ష భాజపాతో చేతులు కలిపి రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడాని జోసెఫ్ గట్టిగా సమర్ధించారు. ఆ ఎమ్మెల్యేలు రాజ్యంగపరమయిన నేరం చేసారు కనుక వారికి ఆ శిక్ష పడాల్సిందేనని తన తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నారు.
జస్టిస్ కె.ఎం. జోసెఫ్ వెలువరించిన తీర్పు చాలా పకడ్బందీగా ఉన్నందున సుప్రీం కోర్టు కూడా దానినే పరిగణనలోకి తీసుకొని, హరీష్ రావత్ కి శాసనసభలో మెజార్టీ నిరూపించుకొనే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ పరిణామాల వలన మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు మూటగట్టుకొంది. చాలా అప్రదిష్టపాలయింది. పార్లమెంటులో లోపల, బయట, మీడియా చేత అక్షింతలు వేయించుకొంది.
అది స్వయంకృతాపరాధమే అయినప్పటికీ దీనికి అంతటికీ కారణం జస్టిస్ కె.ఎం. జోసెఫ్ ఇచ్చిన తీర్పే అని భావిస్తే అసహజమేమీ కాదు. బహుశః ఆ కారణంగానే ఆయనను అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవలసిన ఉమ్మడి హైకోర్టుకి బదిలీ చేసి ఉండవచ్చు. కానీ అది ఆయన సమర్ధతని మరింత బాగా నిరూపించుకోవడానికి వీలు కల్పిస్తుంది. పలు సమస్యలు, వివాదాలతో సతమతమవుతున్న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు అటువంటి నిఖార్సయిన న్యాయమూర్తే చాలా అవసరం ఉందిపుడు. కనుక ఇకపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు హైకోర్టుకి వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వెళ్ళడం మంచిది. లేకుంటే ఆయన తప్పు చేసినవారికి వాతలు పెట్టడం తధ్యం.