కేంద్ర వంచన స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో మోడీ హామీ పచ్చిమోసం అని తేలిపోయింది. పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి జయంతి సిన్హా ఆ మోసాన్ని లిఖితపూర్వకంగా తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఏపీకోసం ప్రత్యేకహోదాకు సంబంధించిన నిబంధనలను మార్చే అవకాశం లేదని ఆయన తెగేసి చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలనే విషయం విభజన చట్టంలో లేదని కూడా ఆయన పాత పాటను వినిపించారు. రాష్ట్రానికి నీతిఆయోగ్ సిఫారసుల మేరకు నిధులు ఇవ్వడం మాత్రమే జరుగుతుందని మంత్రి లిఖితపూర్వకంగా ప్రకటించారు.
తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చేసిన లిఖిత పూర్వక ప్రకటనలో ఈ స్పష్టత లభించింది. దీంతో హోదా విషయంలో కేంద్రం ఇన్నాళ్లుగా ఆడుతున్న డ్రామాలు, నాటకాల విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇచ్చే అవకాశమే లేదని వారు తేల్చేశారు.
కేంద్రం ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే హోదా కోసం మళ్లీ ఒక సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. కేంద్రమంత్రులు చేతకాని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారంటూ రఘువీరారెడ్డి మండిపడ్డారు. కాగా, అసలు సభలో ప్రశ్నను సంధించి ఈ స్పష్టత రావడానికి కారకుడు అయిన ఎంపీ అవంతి శ్రీనివాస్.. మంత్రి సమాధానం తర్వాత మీడియాకు అందుబాటులో ఉండకుండా పోయారు.
కేంద్రమంత్రి సమాధానంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి హోదా గురించి ప్రధాని మోడీ స్వయంగా ఎన్నికల ముందు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని.. పాత ప్రభుత్వం బిల్లు ఆమోదం పొందడం కోసం ప్రధాని మన్మోహన్సింగ్ చట్టసభలో ఇచ్చిన హామీకి ఏం విలువలేకుండా పోవడం దారుణం అని జయదేవ్ వ్యాఖ్యానించారు.
ఇంకా ఈ విషయంలో కీలక నేతలు చాలా మంది స్పందించాల్సి ఉంది. ఎలాంటి శషబిషలు లేకుండా ఇంతగా తెగేసి చెప్పేయడం అనేది భాజపా తెదేపా సంబంధాల మీద ప్రభావం చూపుతుందా అనేదిశగా కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి.