జగన్ నోట మళ్ళీ అదే మాట ఈరోజు వినిపించింది. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఉన్న బ్రాండిక్స్ దుస్తుల తయారీ సంస్థ ఉద్యోగులు జీతాలు పెంచాలని గత నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కానీ యాజమాన్యం అందుకు అంగీకరించడం లేదు. వారికి సంఘీభావం తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి బుధవారం అచ్యుతాపురం వచ్చేరు. నెలరోజుల్లో వారి సమస్యని యాజమాన్యం పరిష్కరించకపోయినట్లయితే మళ్ళీ వచ్చి ఉద్యోగులతో బాటు తను కూడా నిరాహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు. ఆ సందర్బంగా ఉద్యోగుల సమస్యల గురించి, వారికి వేతనాల పెంచవలసిన అవసరం గురించి మాట్లాడిన తరువాత జగన్మోహన్ రెడ్డి యధాప్రకారం ఈ సమస్యలన్నిటికీ మూల కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తేల్చి చెప్పారు. “మరో రెండేళ్ళు అందరూ కళ్ళు మూసుకొని ఈ కష్టాలు భరించండి. తరువాత మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీ అందరి సమస్యలు తీరిపోతాయి,” అని జగన్ హామీ ఇచ్చారు.
ఆవుకి నాలుగు కాళ్ళు, ఒక తోక, రెండు కొమ్ములు ఉంటాయని చిన్న పిల్లాడు పదేపదే చెప్తున్నట్లుగా, జగన్ కూడా ఎవరికి ఏ కష్టాలు వచ్చినా దానికి ఏకైక పరిష్కారం తను ముఖ్యమంత్రి అయిపోవడమేనని చెపుతుంటారు. అందుకోసం రెండేళ్ళు ప్రజలని కళ్ళుమూసుకొని ఓర్చుకోమంటున్నారు కానీ, రెండు నెలలలోనే ఆయన చూస్తుండగానే పార్టీ నుంచి ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయారు. మిగిలిన రెండేళ్ళలో ఇంకా ఎంతమంది ఆయన వెంట ఉంటారో ఆయనకే తెలియదు. తన పార్టీలో ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వాడు ఇంక రాష్ట్ర ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించేస్తారు? అది అంత సులువయిన పనయితే చంద్రబాబు నాయుడు మోడీ చుట్టూ సహాయం కోసం ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు? ఆయనే స్వయంగా మంత్ర దండం తిప్పేసి రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు అన్నీ తీర్చేసి అందరి మన్ననలు పొందేవారు కదా?