తెదేపాకు వలసల రూపంలో అందివస్తున్న బోనస్ బలంలో మరొకరు కూడా జత కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటిదాకా వరుసగా వైకాపానుంచి వస్తున్న ఎమ్మెల్యేల వలసలను మనం చూస్తున్నాం. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం చేరగల అవకాశాలు కనిపిస్తున్నాయి. పాపం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదంటే.. వారికి చాలా కాలం తర్వాత దక్కిన ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా ఇప్పుడు వారిది కాకుండా పోతున్నది.
వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వివాదం ఇటీవలి కోర్టు తీర్పు ద్వారా ఒక కొలిక్కి వచ్చింది. గతంలో స్థానిక సంస్థల కోటాలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైకాపా తరఫున దేశాయి తిప్పారెడ్డి, అప్పటి కాంగ్రెస్ తరఫున బి. నరేష్‌కుమార్‌రెడ్డి తలపడ్డారు. ఒక్కఓటుతో తిప్పారెడ్డి గెలిచారు. వివాదం కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లెనుంచి వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే కోర్టు మాత్రం కొన్ని రోజుల కిందటి వరకు కేసును విచారించి, నరేష్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినట్లుగా తీర్పు చెప్పింది. కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినట్లు అయింది.
అయితే ఈలోగా నరేష్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి భంగపడ్డారు. కానీ ఆయనను అదృష్టం వరించి ఇప్పుడు కోర్టు తీర్పు రూపంలో ఎమ్మెల్సీ అయ్యారు.
ప్రస్తుతం మీరే పార్టీలో ఉన్నట్లు అని మీడియా అడిగినప్పుడు.. తనను గౌరవించే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానంటూ నరేష్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పడం విశేషం. ఈ సీజన్లో అందరూ అధికార పార్టీలోకే వలసలు కడుతున్న నేపథ్యంలో… ఆయన కూడా తెదేపాలోకి వెళ్తారేమోననే అర్థం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. నరేష్ ఆ నిర్ణయం తీసుకుంటే.. తెదేపాకు అప్రయత్నంగా మరొక ఎమ్మెల్సీ బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.