ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన సమస్య. దాని కోసం పోరాడదలిస్తే డిల్లీలో మోడీ ప్రభుత్వంతో పోరాడాలి లేకుంటే ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వంతో పోరాడాలి కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ఆందోళన చేయబోతున్నారు…అది కూడా ఇందిరా భవన్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు! ఆయనతో బాటు ఆంధ్రాకి చెందిన శైలజానాథ్ తదితర కాంగ్రెస్ నాయకులు కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారుట! కానీ ఎవరెవరు పాల్గొంటారో ఇంకా తెలియవలసి ఉంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కావచ్చు కానీ అక్కడ తలుపులు వేసుకొని ఇందిరా భవన్ లో నిరసన చేయడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలకు నిజంగా అంత నిబద్దత ఉన్నట్లయితే, పార్లమెంటులో వారి పార్టీ ఎంపిల చేత దాని కోసం మోడీని గట్టిగా నిలదీయవచ్చు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సహా కాంగ్రెస్ ఎంపిలు అందరూ అగస్టా కుంభకోణం కేసులో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఏవిధంగా తిప్పికొట్టాలి? సోనియా, రాహుల్ గాంధీలను ఏవిధంగా కాపాడుకోవాలనే ఆలోచిస్తున్నారు తప్ప ఆంధ్రా గురించి ఆలోచించే తీరిక వారికి లేదు. ఉండి ఉంటే కె.వి.పి. రామచంద్ర రావు ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు పెట్టవలసిన అవసరం ఉండేదే కాదు. ప్రత్యేక హోదా అనేది తమ రాజకీయ ప్రత్యర్ధులైన మోడీ, చంద్రబాబులని ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడే బలమైన అస్త్రంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ భావిస్తున్నాయి తప్ప వేటికీ దానిపై నిబద్దత, సాధించుకోవాలనే తపన లేదని స్పష్టం అవుతోంది. ప్రతిపక్షాలకు లేకపోతే పోయే..కనీసం అధికార తెదేపాకి, రాష్ట్ర భాజపా నేతలకి, మోడీ ప్రభుత్వానికి కూడా దానిపై ఏమాత్రం ఆసక్తి, నిబద్దత లేకపోవడం ఆంద్ర ప్రజల దురదృష్టమే.