ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన అధికారిక కార్యకలాపాలు మొత్తం నూతన రాజధాని నుంచే సాగడానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైంది. జూన్ 27వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ప్రస్తుతం అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న నూతన భవనాల్లోకి మార్చేయనున్నారు. జూన్ 15 నాటి నుంచే అమరావతిలోని సెక్రటేరియేట్ పనిచేసేలా తరలించాలని తొలుత అనుకున్నప్పటికీ మంచి ముహూర్తాలు కుదరకపోవడంతో కొంత వెనక్కు నెట్టినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించారు.
పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకునే సదుపాయం పుష్కలంగా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ‘మన గడ్డ మీదనుంచే మన పరిపాలన’ అనే నినాదంతో.. రెండేళ్లు గడుస్తున్న సమయానికే సెక్రటేరియేట్‌ను కూడా తరలించేస్తున్నారు. అందరికంటె ముందుగా తన అధికారిక కార్యాలయాన్నే విజయవాడకు మార్చుకున్న చంద్రబాబునాయుడు.. వెలగపూడి వద్ద సచివాలయ నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఉద్యోగుల తరలింపు విషయంలో ఒక స్థాయిలో వారినుంచి వ్యతిరేకత తర్వాత బుజ్జగింపులు, అమరావతిలో సచివాలన ఉద్యోగులకు 5రోజులే పనిదినాలు, అదనంగా 30 శాతం ఇంటద్దె చెల్లింపు లాంటి అనేక రాయితీలు ప్రకటించిన తర్వాత.. ఉద్యోగుల తరలింపు సానుకూలం అయింది.
మూడు నెలల్లోనే ఈ తాత్కాలిక సచివాలయ భవనాలను పూర్తి చేయడానికి సంకల్పించారు. పనులు మాత్రం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇప్పుడు అవి వేగంగా జరుగుతున్నాయి. కార్యాలయాల లోపల తతిమ్మా వసతుల కల్పనకు సంబంధించి కూడా టెండర్లు ఇప్పటికే పిలిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుకుంటున్న రెండంతస్తుల నిర్మాణాలు జూన్‌లో పూర్తవుతాయనేది అంచనా. జూన్ 27నుంచి సచివాలయం పనిచేస్తుందని, ఈ భవనాల పైన నిర్మించదలచిన మిగిలిన రెండు అంతస్తులకు సంబంధించి ఆ తర్వాత టెండర్లు పిలుస్తాం అని మంత్రి నారాయణ చెబుతున్నారు. జూన్ 27 నాటికి 10వేల మందికి పైగా ఉద్యోగులు వెలగపూడి రానున్నారు. మిగిలిన అంతస్తులు కూడా పూర్తయిన తర్వాత.. మొత్తం ఉద్యోగులు అందరూ వచ్చేస్తారని చెబుతున్నారు.