అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ పై ఆయనతో పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఆమె బుధవారం సి.ఎన్.ఎన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ “డోనాల్డ్ ట్రంప్ ఒక అదుపులేని ఫిరంగి వంటివారు. అవి తమ లక్ష్యాన్ని చేదించలేవు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి…అంతకంటే ముందు ఒక టీవీ స్టార్ గా పని చేసిన వ్యక్తి. అందుకే ఆయన మాట్లాడే మాటలు అలాగ ఉంటాయి. ఆయన ప్రజలను ఆకట్టుకొనేందుకు సంచలన ప్రకటనలు చేస్తుంటారు. అందరిపై ఆరోపణలు చేస్తుంటారు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్నప్పుడు తన విధానాలు, సిద్దాంతాల గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. వాటి ఆధారంగానే మాట్లాడాలి కానీ ఆయన ఒకసారి చైనాని నిందిస్తారు మరోసారి ఎవరిపైనో అణుబాంబులు ప్రయోగిస్తామని చెపుతుంటారు. ఆయన మాటలలో లోతు లేకపోవడం గమనిస్తే, ఆయనకు చాలా విషయాలపై ఏమాత్రం అవగాహన లేదని అర్ధమవుతుంది,” అని అన్నారు.
“మరి అటువంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీలో తనతో పోటీ పడుతున్న వారినందరినీ ఏవిధంగా ఓడించగలిగారు? స్వంత పార్టీలో అందరినీ ఓడిస్తున్న ఆయనను మీరు ఎదుర్కోగలరా?” అనే మీడియా ప్రతినిధి ప్రశ్నకు హిల్లరీ క్లింటన్ చెప్పిన సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
“నిజానికి రిపబ్లికన్ పార్టీలో ఆయనతో పోటీ పడిన అభ్యర్దులెవరికీ ఆయనంత మాటకారితనం లేదు. అందుకే ఆయన తన మాటలతో వాళ్ళ నోళ్ళు మూతపడేలా చేసారు. మరో కారణం ఏమిటంటే రిపబ్లికన్ పార్టీలో ఆయనతో పోటీ పడిన అభ్యర్ధులు అందరూ కూడా ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నవారే. అందుకే వారికి ఆయనని ఏవిధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక చేతులు ఎత్తేశారు. కానీ నేను మాత్రం ఆయనని ధీటుగానే ఎదుర్కొంటున్నాను. అటువంటి వ్యక్తిని ఎదుర్కొని విజయం సాధించడం నాకు ఇష్టమే,” అని అన్నారు హిల్లరీ క్లింటన్.
మొన్న ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ తన పార్టీలో ప్రత్యర్ధిపై విజయం సాధించగా, హిల్లరీ క్లింటన్ ఓడిపోవడం విశేషం. అయినా తను తప్పకుండా పార్టీ తరపున ఎన్నికలలో పోటీపడి అమెరికా అధ్యక్షురాలిగా అవుతానని ఆమె బలంగా విశ్వసిస్తున్నారు.