ఐ.ఆర్.సి.టి.సి.వెబ్ సైట్ హ్యాక్ అయినట్లు తాజా సమాచారం. దానిలో పేర్లు నమోదు చేసుకొన్నవారిలో సుమారు ఒక కోటి మంది వ్యక్తిగత వివరాలు అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ, వయసు వగైరాలు కలిగిన సీడిలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రూ.15,000కి ఎవరికో అమ్మినట్లు తాజా సమాచారం. దీనిపై ఐ.ఆర్.సి.టి.సి. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సందీప్ దత్త మీడియాతో మాట్లాడుతూ, “ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ లో నమోదు చేసుకొన్న ప్రజల వ్యక్తిగత వివరాలను అమ్మకానికి పెట్టినట్లుగా మూడు రోజుల క్రితం ముంబైలోని ఇంటలిజన్స్ బ్యూరో సైబర్ సెల్ అధికారులు మాకు తెలియజేసారు. వెంటనే దానిపై మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాము. కానీ అటువంటిదేమీ జరిగినట్లు మా దృష్టికి రాలేదు. బయట అమ్మకానికి పెట్టిన ఆ వ్యక్తిగత వివరాలున్న సిడి మా సంస్థ నుంచి తస్కరించబడినదేనా..కాదా అని తెలియాలంటే, ఆ వివరాలు ఎప్పుడు బయటకు పొక్కాయనే విషయం తెలియాలి. దాని కోసం సైబర్ సెల్ అధికారులతో మాట్లాడుతున్నాము. ఐ.ఆర్.సి.టి.సి.వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న వార్తలలో నిజం లేదు. అది ఎంచక్కగా పనిచేస్తోంది,” అని చెప్పారు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు కూడా గుర్తించి రైల్వే అధికారులను అప్రమత్తం చేసారు. వాళ్ళు వెంటనే ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ నిర్వాహకులను అప్రమత్తం చేసారు. ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ ని ఎవరు హ్యాక్ చేస్తున్నారో కూడా పోలీసులు గుర్తించినట్లు ఒక ప్రముఖ ఛానల్ పేర్కొంది. అంటే వెబ్ సైట్ హ్యాకింగ్, సమాచారం దొంగతనం రెండూ నిజమేనని అనుమానించక తప్పదు.