కేంద్రప్రభుత్వం ఏపీ పట్ల ఎంత దారుణమైన వివక్షను ప్రదర్శిస్తున్నదో తెలుసుకోవడానికి ఇది మరొక ఉదాహరణ. ప్రత్యేక హోదా విషయంలో వారి వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. రెవిన్యూ లోటును పూడ్చేలా కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలనే నిబంధన ఏదీ లేదని తెగేసి చెప్పేశారు. మీ చావు మీరు చావండని పరోక్షంగా సెలవిచ్చారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కూడా దారుణంగా అన్యాయం చేశారు. హోదా, రెవిన్యూలోటు ఇవ్వడం అంటే కేంద్రం తమ ఖజానా నుంచి సొమ్ములు దఖలు చేయాలి. కానీ రైల్వేజోన్‌కు ఏమైంది? ఇందులో కేంద్రం కోల్పోయేది ఏముందో అర్థం కాని సంగతి! ఏమైనా ఒనగూరితే ఏపీకి అదనపు ప్రయోజనాలు ఉంటాయే తప్ప.. కేంద్రానికి పోయేదేమీ ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం నో చెప్పింది. చివరికి విజయవాడనుంచి విశాఖ మీదుగా న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కొత్తగా ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం నో చెబుతోంది.
విజయవాడ నుంచి న్యూఢిల్లీకి కొత్తగా ఒక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేయడం గురించి ఏపీ సర్కారు వారి వినతి కేంద్రం వద్ద పెండింగులో ఉంది. దీని విషయంలో కూడా కేంద్రం అన్నిటిలాగానే ఇదిగో అదిగో అంటూ మీనమేషాలు లెక్కిస్తూ వస్తోంది. తాజాగా పార్లమెంటులో సమాధానం చెప్పాల్సి వచ్చేసరికి ‘అలాంటి కొత్త రైలు సర్వీసు ప్రారంభించే ప్రతిపాదన ఏమీ తమ వద్ద లేదని’ కేంద్ర తెగేసి చెప్పేసింది.
అమరావతి విశాఖ మీదుగా ఢిల్లీకి రైలు వేస్తారా అని ఎంపీ మురళీ మోహన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తేలింది. వనరులు, నిర్వహణ పరంగా ఉన్న సమస్యల వల్ల ఈ రైలు ప్రవేశపెట్టడం లేదని తేల్చేశారు. కేంద్రం ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం, అనాధలా ఏర్పడిన రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడేలా సహకరించడం కోసం ఏ ఒక్క శాతమైనా చేయూత అందించే ఉద్దేశంతో లేదని అర్థమైపోతున్నది మరి!