ప్రత్యేకహోదా విషయంలో మోడీ సర్కారును విపక్ష పార్టీలు మాత్రం తూర్పారపడుతున్నాయి. అదే అదికార తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రం.. ఒకవైపు తమ నిరసన వ్యక్తం చేస్తూనే.. సన్నాయొ నొక్కులు నొక్కుతున్నారు. ప్రత్యేకహోదా కోసం ఇప్పటికే ప్రజా ఉద్యమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రీకారం దిద్దింది.
వైకాపా తరఫున హోదా కోసం పోరాట క్రమాన్ని ప్రకటించిన బొత్స సత్యనారాయణ.. రాజకీయాలు మానుకుని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని స్పష్టం చేయాలని అడుగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఈనెల 10 వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ప్రత్యేకహోదా కోసం ధర్నాలను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అవసరమైతే మరో మారు ఢిల్లీ వెళ్తాం అని కూడా బొత్స అంటున్నారు. ప్రధాని మోడీ ఇంటి ఎదురుగానే పార్టీ ధర్నా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నదని చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉన్నదని ఆయన కోరుతున్నారు.
అవసరమైతే రెండు నిమిషాల్లో కేంద్రంనుంచి బయటకు వస్తాం అంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాం ఉమా.. అదే సమయంలో తెదేపా మిత్రపక్షంగా ఉండడం వల్ల మాత్రమే రాష్ట్రానికి ఈ మాత్రం నిధులైనా వచ్చాయని ఆత్మవంచన చేసుకుంటూ సెలవిస్తున్నారు. ఎందుకంటే.. ఒకవైపు సాక్షాత్తూ వాళ్ల పార్టీ అధినాయకుడు చంద్రబాబే.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు నిధులు ఇస్తున్నారే తప్ప ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదని అంటూ ఉంటే.. మిత్రపక్షం కావడంవల్ల అదనపు నిధులు వచ్చాయంటూ చెప్పడం ద్వారా ఉమా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. తెలుగుదేశం నాయకులు ఈ డొంకతిరుగుడు మాటలు మానేసి హోదా విషయంలో తమ వైఖరి, ఉద్యమబాట గురించి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.