‘విభజన చట్టంలో పొందు పరచిన ప్రతి అంశాన్నీ నెరవేరుస్తాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి భయాలు, సందేహాలు అవసరం లేదు’ … ఇదీ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం నాడు చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఎలా మాయచేయబోతున్నదో, జనాన్ని ఎలా బురిడీ కొట్టించి… ఏపీని వంచించడానికి పూనుకుంటున్నదో ఈ ఒక్క వాక్యం చూస్తే చాలు అర్థమైపోతుంది. జైట్లీ ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేస్తున్న సమయంలో ”ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లు హోదా ఇస్తే సరిపోతుందా.. మా ప్రభుత్వం వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం” అంటూ తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ప్రకటన చేసిన… మోడీ తనకేమీ సంబంధం లేనట్లుగా, అభావంగా వింటూ ఉండడం విశేషం.
ఫైనాన్స్ బిల్లు ఆమోదం గురించి లోక్‌సభలో జైట్లీ గురువారం నాడు మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపుల విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావన వచ్చింది. తెలుగుదేశం ఎంపీలు ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నప్పటికీ.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా జైట్లీ తాను చెప్పదలచుకున్నది చెప్పుకుంటూ పోయారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటిదాకా ఆరువేల కోట్ల రూపాయలు ఇచ్చాం అంటూ జైట్లీ ఓ అతిపెద్ద అబద్ధాన్ని అందంగా, సభాముఖంగా సెలవిచ్చారు. ఏపీ రాష్ట్రానికి అన్ని రకాల కేటాయింపుల రూపేణా 6 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందే తప్ప.. విభజన చట్టం ప్రకారమే అంత సొమ్ము ఇచ్చాం అనడం ఫక్తు మోసమే అని జనం నిరసిస్తున్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అనే ముక్కను మాత్రం తన నోటివెంట పలుకకుండా జైట్లీ చాలా మాయ చేసేలా వ్యవహరించారు. ఏపీ అడిగిన దానికంటె ఎక్కువే ఇచ్చాం అని సెలవిచ్చిన జైట్లీ రెవిన్యూలోటు విషయాన్ని ఇంకా అధ్యయనం చేస్తున్నాం అంటూ దాటవేయడం విశేషం. ఏపీకి తాము చేస్తున్న ద్రోహానికి సంబంధించి పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడానికి ఇప్పటికీ జైట్లీ ప్రయత్నించడం విశేషం. విభజన చట్టంలో పొందుపరచిన అన్నీ చేస్తాం.. సందేహాలు అక్కర్లేదు అనడం ద్వారా.. హోదా చట్టంలో లేదు గనుక.. ఎగ్గొట్టేస్తాం అని చెప్పినట్లే కనిపిస్తోంది. కాకపోతే.. ఆయన చాలా అందంగా ఆ చేదువార్తను మనకు వినిపిస్తున్నారు. విభజన పాపం ఏదైనా ఉంటే అది యూపీఏ సర్కారు దే అంటూ జైట్లీ తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడం విశేషం.
పోలవరం విషయంలో ఇప్పటిదాకా కేవలం ముష్టిలాగా విదిలించిన జైట్లీ.. దీనికి తాము పుష్కలంగా నిధులిస్తున్నాం అంటూ సభలో సెలవిచ్చారు. అయితే పోలవరం ప్రస్తావన సమయంలో సభలో ఒదిశా రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిరసనలు తెలియజేయడం గమనార్హం.