విద్యుల్లేఖా రామన్ పాస్ పోర్ట్ చిక్కులు తొలగిపోయాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్న విద్యుల్లేఖ బుధవారం తన బ్యాగ్ పోగొట్టుకొంది. అందులో పాస్పోర్ట్ కూడా ఉండడంతో తిరుగు ప్రయాణానికి ఇబ్బంది ఎదురైంది. ఈ విషయంలో కంగారు పడుతూ.. బుధవారం ట్వీట్ చేసింది. దాంతో ఆస్ట్రియాలోని భారత ఎంబసీ ఆమెకు అండగా నిలిచింది. ఆమెకు తాత్కాలిక ట్రావెల్ పర్మిట్ని జారీ చేశారు. దాంతో విద్యుల్లేఖ ఇండియా తిరుగు ప్రయాణానికి మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని ఆమే ట్విట్టర్లో పంచుకొన్నారు. క్లిష్ట సమయంలో తనకు అండగా ఉన్నవారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంది ఈ హాస్య నటి.
వియన్నాలోని హోటెల్ రూమ్లో బ్యాగ్ పోయిన వెంటనే.. సిబ్బందికి తన పరిస్థితి విన్నవించుకొంది విద్యుల్లేఖ. అయితే.. వాళ్ల నుంచి సరైన సహకారం అందలేదు. దాంతో సహాయం కోసం ట్విట్టర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అక్కడ భారత ఎంబసీ స్పందించి ఆమెకు తగిన సాయం చేసింది. కావల్సిన పత్రాలన్నీ సమకూర్చడంతో ఈ సమస్య నుంచి బయటపడగలిగింది.