ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి జయంతి సిన్హా పారలమెంటులో చెప్పిన సమాధానం బిజెపికి వ్యతిరేక ఉద్వేగాలను భగ్గుమనిపించింది. అయితే, ప్రత్యేక హోదా కుదరన్న విషయం రాష్ట్రప్రభుత్వానికి ఆకస్మికమైన షాక్ కాదు…హోదా వుండదు అంటే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువౌతుందని కేంద్రప్రభుత్వానికీ తెలియంది కాదు.
ప్రత్యేక హోదా కు ప్రత్యామ్నాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నాయకుల స్ధాయిలో, అధికారుల స్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇవి కొలిక్కి రాకముందే ప్రత్యేక హోదా డిమాండుతో ఎంపి – కెవిపి రామచంద్రరావు ప్రయివేటు మెంబరు బిల్లుని ప్రవేశపెట్టడం, ఇదే విషయంగా ఎంపి అవంతి శ్రీనివాసరావు ప్రశ్న వేయడంతో చట్టసభలో సమాధానం చెప్పక తప్పని స్ధితి కేంద్రప్రభుత్వానికి ఎదురైంది. సమాధానం చెప్పినంత మాత్రాన ఈ కథ ముగిసిపోయినట్టు కాదు. విషయం ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది కనుక వారి మనోభావాలు వ్యతిరేకంగా బలపడకముందే ఆల్టర్ నేటివ్ సొల్యూషన్లు కనుక్కోవలసిన వత్తిడి బిజెపి, తెలుగుదేశం పార్టీల మీద పెరుగుతున్నాయి.
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్ధికాంశాల పంపిణీ స్ట్రక్చర్ ను మోదీ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఫైనాన్స్ కమీషన్ స్ధానంలో నీతిఆయోగ్ ఏర్పాటు లక్ష్యం ఈ మార్పే! కొత్త పాట్రన్ లో ”ప్రత్యేక హోదా”లు యధాతధంగా కుదరవు. మరో 7 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్న నేపధ్యంలో, ఎపి కి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రాల నుంచి పరిశ్రమలు ఇతర అక్కడికి తరలిపోతాయని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో రాజకీయ కోణం నుంచి కూడా ప్రత్యేక హోదా ఫైలుని కేంద్రం శాశ్వతంగా మూసేసింది.
ప్రత్యేక హోదా వల్ల లభించే 90 శాతం గ్రాంటులో 70 శాతం మొత్తాన్ని ఏదో రూపంలో ఎపికి ఇవ్వగలమని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. అధికారుల స్ధాయిలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. మిగిలిన 20 శాతం కూడా కేంద్రమే ఇవ్వాలన్న రాష్ట్ర అధికారుల ప్రతిపాదనపై కేంద్రం నుంచి ఏ సమాధానమూ రాలేదు.
ప్రత్యేక ఆర్ధిక సహాయంగా లక్ష కోట్లరూపాయల ప్యాకేజిని కేంద్రం ప్రతిపాదించింది. అది ఐదేళ్ళకాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రెగ్యులర్ గా వచ్చేసహాయం తప్ప అదనపు సహాయకాదని అధికారులు విశ్లేషించారు. దీనిపై కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి.
రాష్ట్రం వైపునుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలప్రకారమే రాష్ట్ర అధికారులు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా, ప్రత్యక్ష సమావేశాల ద్వారా కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏక పక్షంగా జరిగిన విభజనవల్ల ఆదాయాలు వచ్చే హైదరాబాద్ ను కోల్పోయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిన ప్రత్యేక పరిస్ధితులపై డిల్లీ అధికారులకు సమగ్రమైన అవగాహన లేదని అందువల్లే వారు మెరుగైన ప్యాకేజీలను రూపొందించలేకపోతున్నారనీ రాష్ట్ర ఆర్ధిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ”ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం అమలు కావడం లేదన్న విషయం ప్రధానికి తెలుసో లేదో” అని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది.
బడ్టెట్ సవరణలపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్ సభలో మాట్లాడుతూ ”విభజన చట్టంలోని ప్రతీ అంశాన్నీ అమలు చేస్తాం! ఎపికి ఇవ్వవలసిన ప్రతీ పైసా ఇస్తాం” అని ప్రకటించారు. ఇది రెండేళ్ళుగా విసిపిస్తున్న ఆడియో రికార్డే తప్ప కొత్త విషయమేమీలేదు.
అయితే ఇంతటితో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కథ ముగిసిపోయినట్టు కాదు. ప్రత్యామ్నాయ పాకేజీలు సిద్ధమౌతున్నాయి. అవి రాష్ట్రానికి కూడా ఆమోదయోగ్యమయ్యాకే ఎపి కి కేంద్రం చేసిన చేస్తున్న మేళ్ళను వెయ్యినోళ్ళతో ఏకరువు పెట్టడానికి (ప్రస్తుతం)మాయమైపోయిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మళ్ళీ ప్రత్యక్షమౌతారు.