కాంగ్రెస్ ఎంపి కె.వి.పి. రామచంద్ర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం, దానిపై సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడం, అప్పటి నుంచి రాష్ట్రంలో మళ్ళీ రాజకీయా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడం వగైరా అన్నీ అందరికీ తెలిసినవే. తెదేపా-భాజపాల మధ్య చిచ్చు రాగలడానికి కారణమయిన ఆ ప్రైవేట్ బిల్లుపై దానిని ప్రవేశపెట్టిన కె.వి.పి. రామచంద్ర రావుని పరిహసిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడారు. “మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా మీకు విల్ (ఆసక్తి) చూపలేదు ఇప్పుడు బిల్ పెడుతున్నారు. మీ బిల్ పై సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది,” అని చెప్పారు.
ఈ విషయంలో వెంకయ్య నాయుడు ఇతరులను పరిహసించడానికి లేదు. ఎందుకో అందరికీ తెలుసు. ఒక ఏడాది క్రితం వరకు ఆయన రాష్ట్రం వచ్చినప్పుడల్లా తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామనే చెప్పేవారు. ఆ తరువాత ఆయన కూడా మాట మార్చారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదాయన. ఇవ్వాళ్ళ పార్లమెంటులో దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన దానికంటే చాలా ఎక్కువే సహాయం చేసింది కనుక ప్రత్యేక హోదా ఇవ్వనవసరం లేదన్నట్లు మాట్లాడారు. దానిని విభజన చట్టంలో చేర్చలేదని చెపుతూ అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టారు.
చట్టంలో చేర్చాకపోవడమే అవరోధం అయితే కె.వి.పి. రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకి మద్దతు ఇచ్చి ఆమోదించవచ్చు కదా? కానీ అటువంటి ఆలోచన కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంటుగా మారిందనే సంగతి తెలిసీ కూడా మోడీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతోంది. అలాగా చేస్తే ఏమవుతుందో తెదేపా ఎంపి గలా జయదేవ్ నిన్న లోక్ సభలో చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా గత ఏడాది ఇదే సభలో హామీ ఇచ్చారు. కనీసం ఆ హామీని కూడా నిలబెట్టుకొని ఉన్నా నేడు ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది కాదు కదా. బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు అడగకపోయినా భారీ ఆర్ధిక ప్యాకేజిలు ప్రకటించే మోడీ ప్రభుత్వం మిత్రపక్షమయిన తెదేపా పదేపదే బ్రతిమాలుతున్నా కూడా ఎందుకు ఇవ్వడం లేదు? అనే అందరూ ప్రశ్నిస్తున్నారు. కనీసం దానికయినా నేరుగా జవాబు చెప్పవచ్చు కదా?