భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నలుగుతున్న అనేక తీవ్ర సమస్యలలో నాగాల సమస్య కూడా ఒకటి. అప్పటి నుండి నాగాలాండ్ లో ఉన్న 16 వివిధ తెగల మధ్య చిన్నపాటి యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కారణంగా నాగాలాండ్ లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పటికీ అక్కడ ఎప్పుడూ కూడా అశాంతి, రాజకీయ అనిశ్చిస్థితి నెలకొని ఉండేది. అదీకాక నాగా తిరుగుబాటుదారులు భారతసేనలతో గెరిల్లా యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, స్వర్గీయ పీవీ నరసింహ రావుల హయంలోనే నాగాల మధ్య అంతర్యుద్ధాలను నివారించి వారిని మిగిలిన భారతదేశంతో అనుసంధానం చేసేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరిగాయి. చివరికి నరేంద్ర మోడీ హయాంలో నాగాలు భారత ప్రభుత్వంతో రాజీకి సిద్దపడి శాంతి ఒప్పందాలపై సోమవారం నాడు సంతకాలు చేసారు. ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ముయివా వర్గం) సంస్థ నేత ఐజేక్ స్యూ దీనికి మార్గం సుగమం చేసారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఇకపై అందరూ కలిసి నాగాలాండ్ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ నాగాలాండ్ ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రతిపక్ష నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొన్నాక అడుగు ముందుకు వేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, హోం శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు నాగాలాండ్ కి చెందిన వివిధ నాగా గ్రూపుల నేతలు పాల్గొన్నారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఇకపై నాగాలు అందరూ తమ ఆయుధాలు విడిచిపెట్టి తమ రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తారు. కేంద్రప్రభుత్వం కూడా నాగాలాండ్ అభివృద్ధిపై ప్రత్యేకహోదా దృష్టి పెడుతుంది.