ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సారి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సవాలు చేస్తున్న ప్రతిపక్షం, సహకరించని మిత్రపక్షం, ప్రాజెక్టులపై ఘర్షణకు సై అంటున్న పొరుగు రాష్ట్రం, ఏం చేస్తే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పోనీ దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ప్యాకేజీ ఇస్తుందా అంటే అదీ చెప్పలేదు. ఏటేటా కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరుగుతుందనే ఆశ కూడా నెరవేరడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రంపై పోరాటం చేసైనా న్యాయం పొందాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మిత్రపక్షం. ఇదే పాయింటు మీద వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మిత్రపక్షమై ఉండి కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతోందని దుమ్మెత్తి పోస్తోంది. ఒకరకంగా చంద్రబాబును పరుగులు పెట్టించడానికి ప్రయత్నిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ అంశంగా మార్చడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. అది రాకపోవడం రాష్ట్రానికి అనర్థమని పదే పదే ప్రచారం చేస్తోంది. దాన్ని సాధించని టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండకూదనే భావనను నూరిపోయడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ విషయంలో తాను వెనకబడితే వైసీపీ దూసుకుపోతుందేమో అని చంద్రబాబు భయం.
ఇప్పుడు మిత్రపక్షంగా ఒత్తిడి చేయాలా, శత్రుపక్షంగా మారి యుద్ధం చేయాలా అనేది చంద్రబాబు తేల్చుకోవాల్సిన విషయం. ఇది అంత సులభం కాదు. పోనీ, కేవీపీ రామచంద్ర రావు ప్రయివేటు బిల్లుకు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది కూడా ఇంకా ఇంకా తేల్చుకోనట్టే ఉంది. ఆ బిల్లుకు మద్దతిస్తే మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు అవుతుంది. దానిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే.
ఇంత సాహసానికి చంద్రబాబు సిద్ధపడతారా అనేది ప్రశ్న. ఒకవేళ సిద్ధపడితే దీనికి మరో లింకు ఉంది. అది మరో పెను సవాలుగా మారే అవకాశం ఉంది. తనకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు కృష్ణా గోదావరి నీరు వాడుకుని తీరుతామంటోంది తెలంగాణ. అసలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే నీటి విషయంలో అన్యాయాన్ని సరిదిద్దడానికి అని సీఎం కేసీఆర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.
ప్రాజెక్టుల పంచాయితీని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని టీడీపీ భావిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మద్దతు పొందడం ఏపీకి తప్పనిసరి. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ సరిగ్గానే వ్యవహరిస్తోందని కేంద్రం తేల్చేస్తే అప్పుడు జగన్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అటు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో, ఇటు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం బాబు ప్రభుత్వం విఫలమైందని ఊరూవాడా కోడై కూసేలా ఆందోళనలు ముమ్మరం చేయవచ్చు.
ఆ పరిస్థితే గనక ఎదురైతే వచ్చే ఎన్నికల్లో వైసీపీతో మరింత ఇబ్బంది కలగవచ్చు. ఇది చంద్రబాబుకు, ఆయన పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి కర్ర విరగొద్దు… అనే తరహాలో నొప్పించక తానొవ్వక కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులను రాబట్టడం ఎలా అనేదే చంద్రబాబు ఆలోచించాల్సిన విషయం. ఉన్నపళంగా బీజేపీకి శత్రుపక్షంగా మారినా సాధించేది పెద్దగా ఏమీ లేదని టీడీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మోడీని కన్విన్స్ చేయడం ద్వారా నిధులు, నీళ్ల విషయంలో తగిన న్యాయం పొందడానికి బాబు మరింత గట్టిగా ప్రయత్నించడం మేలనేది టీడీపీ శిబిరంలో వినిపించే మాట. ఇంతకీ చంద్రబాబు ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉంది.