తెలంగాణా వైకాపా అధ్యక్షుడు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీలో మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెరాసలో చేరిపోవడంతో రాష్ట్రంలో పార్టీ ఉనికి కోల్పోయింది. చింత చచ్చినా పులుపు చావనట్లు, రాష్ట్రంలో పార్టీ కనబడకపోయినా, ఏనాడు ప్రజా సమస్యలపై నోరు మెదపకపోయినా, పార్టీలో మిగిలిన గుప్పెడు మంది నేతలు లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశమయ్యి ఒకటీ రెండూ కాదు..ఏకంగా ఆరు తీర్మానాలు ఆమోదించడం చూస్తే ఎవరికయినా నవ్వురాక మానదు. పోనీ అవేమయినా గొప్ప తీర్మానాలా అంటే అదీ కాదు. వాళ్ళు నలుగురు కూర్చొని అనుకొన్న మాటలనే తీర్మానాలని చెప్పుకొన్నారు.
ఇంతకీ అవేమిటంటే:
1. ప్రస్తుత కార్యవర్గం రద్దు (అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు)
2.కొత్త కార్యవర్గం, పార్టీ అధ్యక్షుడు నియామకం బాధ్యత జగన్ కే అప్పగించడం. (వాళ్ళు ఈ తీర్మానం చేసినా చేయకున్నా జరిగేది అదే)
3. పాలేరు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం (అది ముందు అనుకొన్నదే)
4. వైకాపాని తెరాసలో విలీనాన్ని ఖండిస్తూ ఓ తీర్మానం (ఈ ముక్క చెప్పడానికి తీర్మానం ఎందుకో)
5. తెలంగాణాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలనే తీర్మానం (ఇది కూడా నేరుగా మీడియా ద్వారా తెరాస ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చు)
6. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలి. (రాజశేఖ రెడ్డే తెలంగాణాకు అన్యాయం చేసారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు వాదిస్తుంటే, ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయమని తీర్మానం చేస్తే పట్టించుకొంటారా? అయినా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం చేసిన తరువాత కూడా ఇంకా ఈ తీర్మానాలు ఎందుకో?)
అయితే ఈ తీర్మానాల వలన ఒక్క విషయం మాత్రం స్పష్టమయ్యింది. అదేమిటంటే తెలంగాణాలో వైకాపా దుఖాణం అప్పుడే మూసేయరని. కానీ దాని వలన జగన్ ఇంకా ఏమి ప్రయోజనం ఆశిస్తున్నారో ఆయనకే తెలియాలి.