2014 ఎన్నికల ప్రచార సమయంలో తెరాస అధికారంలోకి వస్తే తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పునర్విభజించి, మొత్తం 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ తరువాత ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి గానీ కొన్ని రాజకీయ, సాంకేతిక అవాంతరాలు రావడంతో, తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి, ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అవసరమయిన పనులు పూర్తి చేయిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అధికారులతో దాని గురించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా కనీసం 14 జిల్లాలు, 40 మండలాలు ఏర్పాటు చేయడానికి వీలుగా పరిపాలన, పోలీస్ అధికారుల నియామకాలు, వారికి జిల్లా, మండల కేంద్రాలలో కార్యాలయాలు వగైరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. అయితే ఆగస్ట్ 15 నుంచి అన్ని హంగులతో కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పారు. అంటే మరో రెండున్నర నెలలలో తెలంగాణా కొత్త రూపం సంతరించుకోబోతోందన్నమాట. ప్రతీ పది మండలాలకు ఒక ఆర్.డి.ఓ. ని నియమించడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని కేసీఆర్ తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం జగిత్యాల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల్, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.