రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ త్వరలో తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యన ఆయన గోవా వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “మూడు నాలుగు నెలలలో నేను గోవా తిరిగి వచ్చేయబోతున్నాను,” అని ప్రకటించారు.
గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారిక్కర్ చాలా సమర్ధమయిన, పారదర్శకమయన పాలన సాగించి ప్రజలలో, పార్టీలో కూడా మంచి పేరు సంపాదించుకొన్నారు. ముఖ్యంగా ఆయన నిరాడంబరత, సాహసోపేతమయిన నిర్ణయాలకు గోవా ప్రజలు చాలా ముగ్ధులయ్యేరు. ఆయన సమర్ధత, పార్టీ పట్ల విధేయతను చూసే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఏరికోరి డిల్లీ రప్పించుకొని రక్షణమంత్రిగా నియమించుకొన్నారు.
రక్షణమంత్రిగా కూడా అయన చక్కగా పనిచేసారు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఆర్మీలోని ఒకే హోదా-ఒకే పెన్షన్ సమస్యని ఆయన చొరవ తీసుకొని పరిష్కరించారు. రక్షణ శాఖలో అంతర్గతంగా అనేక కీలక మార్పులు చేర్పులు చేసి, అందరి మన్ననలు పొందారు.
ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డిల్లీ వెళ్ళిపోయినా తరువాత ఆయన స్థానంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా నియమింపబడ్డారు. కానీ ఆయన మనోహర్ పారిక్కర్ స్థాయిలో పనిచేసి మెప్పించలేకపోవడంతో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో భాజపా తన పట్టు కోల్పోయే ప్రమాదం ఏర్పడినట్లు కేంద్రం గుర్తించింది. అందుకే మనోహర్ పారిక్కర్ ని మళ్ళీ గోవా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మనోహర్ పారిక్కర్ మీడియా ప్రకటన కూడా అదే దృవీకరిస్తోంది. ఆయన వంటి మంచి సమర్ధుడు, నిజాయితీపరుడు మళ్ళీ రాష్ట్రానికి త్రిప్పి పంపడం మోడీకి చాలా కష్టమే కానీ వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలలో భాజపా విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవాలంటే తప్పదు.