ఇంతకు ముందు చెప్పుకొన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు బాగా అలవాటయిన పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదాపై మళ్ళీ వెనక్కి అడుగులు వేయడం మొదలుపెట్టారు. మూడు నాలుగు రోజుల పాటు దాని కోసం కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన తెదేపా నేతలను వెనక్కి తగ్గమని సూచించారు. భాజపా నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయవద్దని మంత్రులకు, పార్టీ నేతలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం సహాయసహకారాలు అవసరమయిన ఈ సమయంలో కేంద్రంతో తగువు పెట్టుకొని విడిపోతే మనమే తీవ్రంగా నష్టపోతామని, తెదేపా-భాజపా సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని కనుక అందరూ తమ విమర్శల జోరు తగ్గించాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ సమస్యకి కాంగ్రెస్ పార్టీ, వైకాపాలే కారణం అనే విధంగా ఎదురుదాడి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బహుశః అందుకే మంత్రి పుల్లారావు విమర్శలలో ఎక్కడా కేంద్రం ప్రస్తావన చేయకుండా, ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అంటూ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. భాజపాతో తమ పార్టీ తెగతెంపులు చేసుకొంటే జగన్మోహన్ రెడ్డి దానితో పొత్తులు పెట్టుకొందామని ఆశగా చూస్తున్నారని కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదని అన్నారు. బహుశః నేడో రేపో చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి అందరినీ కలిసి వాటి కోసం మరోసారి విజ్ఞప్తులు చేసి వస్తారేమో? అంతటితో ఈ ప్రత్యేక హోదా ఎపిసోడ్ పోర్తయిపొయినట్లే భావించవచ్చు.