కమర్షియల్ దర్శకులు కావాలంటే.. టాలీవుడ్‌లో పెద్దగా వెదుక్కొనేపని లేదు. అడుగో దర్శకుడు దొరికేస్తాడు. కానీ ఓ కొత్త పాయింట్‌ని కమర్షియల్ పంధాలో చెప్పే నేర్పు మాత్రం అరుదుగా ఉంటుంది. అలాంటి లక్షణాలున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. 13బి, మనం.. ఇప్పుడు 24 చూస్తే, మిగతా దర్శకులకు విక్రమ్ ఎంత దూరంలో ఉన్నాడో అర్థం అవుతుంది. స్ర్కీన్ ప్లే విషయంలో విక్రమ్‌కున్న పట్టు, క్లిష్టమైన కథని వెండి తెరపై ఆవిష్కరించే లక్షణం.. ఇవన్నీ సూపర్బ్ అనిపిస్తాయి. ఈరోజే విడుదలైన 24.. విమర్శకులకు తెగ నచ్చేస్తోంది. సినిమా అంటే ఇలా ఉండాలి అని కితాబిస్తున్నారు కూడా. విక్రమ్‌తో పనిచేయాలనుకొన్న హీరోలు ఇప్పుడు మరింత తొందర పడుతున్నారు. ఆ జాబితాలో ముందున్నారు అల్లు అర్జున్, మహేష్ బాబు.
సరైనోడు పూర్తవ్వగానే విక్రమ్ కె.కుమార్‌తో సినిమా చేయాల్సింది బన్నీ. అయితే మధ్యలో లింగుస్వామి కథకీ ఓకే చెప్పాడు. విక్రమ్ కుమార్ స్ర్కిప్టు పూర్తి చేయడానికి 4 నెలల సమయం అడిగాడట. ఈలోగా లింగుస్వామి సినిమా పట్టాలెక్కించేద్దామనుకొన్నాడు బన్నీ. అయితే ఆ నిర్ణయం 24 రిజల్ట్‌తో మార్చుకోక తప్పదన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. విక్రమ్ కోసం బన్నీ నాలుగు నెలలు ఆగే అవకాశం ఉందని టాక్. మురుగదాస్ తరవాత.. మహేష్ బాబు విక్రమ్‌తో ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే మధ్యలో పూరి జగన్నాథ్ సినిమా చేద్దామంటూ వెంటపడుతున్నాడు. అయితే మహేష్ కూడా విక్రమ్ కుమార్‌కే ఓటేసే అవకాశం ఉంది. సో.. బన్నీ, ప్రిన్స్‌లు.. ఈ దర్శకుడ్ని వదలరు గాక వదలరు.