ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే ఇక భాజపా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు తగ్గించమని తన మంత్రులకు, పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లు మీడియాకి లీకులు అందేయి కనుక ప్రత్యేక హోదాపై తెదేపా పోరాటం దాదాపు ముగిసిపోయిందనే చెప్పవచ్చు. దానితో ఒక అధ్యాయం ముగిసి, తమపై విమర్శలు గుప్పించిన తెదేపా నేతలపై భాజపా నేతలు విమర్శలు గుప్పించే రెండవ అధ్యాయం ప్రారంభం అయ్యింది. దానిని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పి.రఘురాం ప్రారంభిస్తూ “ప్రత్యేక హోదా విషయంలో తెదేపా మంత్రులు, నేతలు చాలా బాధ్యతారహితంగా మాపై విమర్శలు చేస్తున్నారు. మిత్రధర్మం పాటించి మేము మౌనంగా ఉంటున్నాము. వాళ్ళకి జవాబులు చెప్పడం మాకూ వచ్చు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను, ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించడం లేదంటే ఆయన ఆదేశాలతోనే వాళ్ళు ఆ పని చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా చేసింది. ఇచ్చిన హామీలలో చాలా వాటిని అమలుచేస్తోంది. వాటి గురించి తెదేపా నేతలెవరూ మాట్లాడరు..ఇవ్వని వాటి గురించే మాట్లాడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు అడిగినా అడగకపోయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేయగలదో అన్నీ చేస్తుంది. కనుక మా బాధ్యతల గురించి మాకు ఎవరూ గుర్తు చేయనవసరం లేదు.”
“ప్రత్యేక హోదా రాకపోతే కొంపలు మునిగిపోవు అన్న చంద్రబాబు నాయుడే ఇప్పుడు అదివ్వకాపోతే రాష్ట్రం చాలా నష్టపోతుందన్నట్లు మాట్లాడుతున్నారు. విభజన చట్టంలో దానిని చేర్చాకపోవడం వలననే ఇవ్వలేకపోతున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అందులో తప్పేముందని తెదేపా నేతలు అంత హద్దులు దాటి మాట్లాడుతున్నారు? మా పార్టీతో పొత్తులు పెట్టుకొన్నప్పుడే తెదేపా ఎన్నికలలో విజయం సాధిస్తోందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో మా పార్టీని మేము బలోపేతం చేసుకోవడానికి తెదేపా అనుమతి మాకు అవసరం లేదు,” అని అన్నారు.