రాజకీయ పార్టీల విధానాలు, విజయాలే కాదు, అంతర్గత నిర్వహణ (ఇంటర్నల్ మేనేజ్మెంట్) చాలా ముఖ్యం. ఎన్టీఆర్నే తీసుకుంటే రెండు మూడు సార్లు అఖండ విజయాలు సాధించినా అంతర్గత సమస్యల వల్లనే దెబ్బతిన్నారని చరిత్ర చెబుతున్నది. తెలంగాణ సాధన ప్రభుత్వ స్థాపనతో ఒక చారిత్రిక పాత్రనే స్వంతం చేసుకున్న కెసిఆర్ ఈ విషయంలో పొరబడుతున్నారా? ఆయన వాగ్ధాటి, వ్యూహ చతురత గురించిన పొగడ్తలకు లోటు లేదు గాని వాటిని విమర్శనాత్మకంగా బేరీజు వేసుకోగల పరిపక్వత కూడా వున్నవారే. అయితే కమ్యూనిస్టేతర పార్టీలపై తిరుగులేని ఆధిక్యత సాధించడం, ఉప స్థానిక ఎన్నికల్లోనూ అసాధారణ విజయాలు ఆ పార్టీలో నడిపించే ప్రథమ కుటుంబంలో అతి విశ్వాసం పెంచినట్టు కనిపిస్తుంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనట్టు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, విధేయలుగా పేరు పడిన వారు ఇంకా చెప్పాలంటే కనుసన్నల్లోనే వుండేవారు కూడా అసంతృప్త రాగాలు మొదలుపెట్టారు. చర్చల సందర్భంలోగాని, వేడుకలు వేదికల్లోగాని కలిసే టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆశావహులైన మాజీలు తీవ్ర నిరాశనూ నిరసననూ కూడా వెళ్లబోసుకుంటున్నారు.
హరీశ్, కెటిఆర్, ప్రత్యేకంగా కవిత వారి వారి ఈక్వేషన్లు, ప్రొజెక్షన్లు, ప్రొటెక్షన్లు సరే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. కాని అంతకు మించిన అసంతృప్తి అసమ్మతి కూడా ఆ పార్టీలో బీజోపవాసం చేసుకుంటున్నదంటే దానికి అధినేత శైలి కారణంగా వుంది. తమను అసలే పట్టించుకోవడం లేదనీ, ఏం చెప్పినా అక్కడికక్కడే ఖండించేస్తున్నారనీ, అన్నీ తెలుసనే భావం పెరిగిందని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల పదవుల పంపిణీ మొదలైంది గనక సహజంగానే సణుగుడు కూడా పెరుగతుంది. ప్రతిపక్షాలను తీసిపారేయకుండా విమర్శలకు స్పందించి సకాలంలో సవరణలు చేసుకోవడంతో పాటు స్వజనంలో కొరత ఎందుకు పెరుగుతున్నదో అధినేత తెలుసుకోకపోతే అది తగ్గదు.