ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు సంబంధించిన వ్యవహారం మరోమారు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లింది. ఏకపక్షంగా హోదాను తీసుకువచ్చి మన చేతుల్లోపెట్టేసేంత సీన్ వారికి ప్రస్తుతం లేకపోయినప్పటికీ.. ఈవిషయంలో మోడీ సర్కారు ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టి వారిని ఇరుకున పెట్టడానికి మాత్రం పుష్కలంగా అవకాశం ఉంది. రాజ్యసభలో బలం లేని అధికార భారతీయ జనతా పార్టీ తమ దొంగాటకం బయటపడినా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అయితే ఈ రీతిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి బుద్ధి చెప్పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సంకల్పానికి సోనియాగాంధీ మద్దతు ఇస్తుందా లేదా, ఎటూ ఆ రాష్ట్రంలో తమ పార్టీ పతనం అయిపోయింది గనుక.. ఆ రాష్ట్రాన్ని చావనివ్వమంటూ వదిలేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లు ఈనెల 13వ తేదీన రాజ్యసభలో చర్చ మరియు ఓటింగ్‌కు రానుంది. కొన్ని రోజుల కిందట ఆ బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కేవీపీ ఓటింగ్‌కు పట్టుబట్టిన సంగతి అందరికీ గుర్తుంటుంది. ఆరోజున కోరం లేకపోవడంతో ఓటింగ్ 13కు వాయిదా పడింది.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఎంపీలే కాకుండా, యావత్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా మిస్ కాకుండా ఓటింగ్‌లో పాల్గొనేలా చేయడం ద్వారా.. రాజ్యసభలో అధికార భాజపాను ఇరుకున పెట్టాలని ఏపీసీసీ అనుకుంటోంది. ఆ మేరకు 13న ఓటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ పరంగా పూర్తిస్థాయిలో సహకరించాలని సోనియాను కోరుతూ రఘువీరారెడ్డి ఇప్పటికే లేఖ రాశారు. అయితే సోనియా దీనిపై ఎలా స్పందిస్తుందనే దాని మీదే సమస్తం ఆధారపడి ఉంది. ఎటూ ఏపీలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది గనుక.. మనం వారికి ఎందుకు సహకరించాలని సోనియా అనుకుంటే ఇక చేయగలిగేది ఏమీ లేదు. ఏపీలో కాంగ్రెస్ ఏ కొంచెమైనా తిరిగి కాళ్లమీద లేచి నిలబడాలంటే..ఈ చర్య కొంత ఉపకరించవచ్చు.
కాంగ్రెస్ మద్దతు ఇచ్చినంత మాత్రాన హోదా వచ్చేస్తుందని కాదు గానీ.. ప్రెవేటు బిల్లు నెగ్గిందంటే మాత్రం.. హామీల విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణ వంచనకు దిగుతున్న మోడీ సర్కార్‌కు బుద్ధి వస్తుందని భావించవచ్చు.