రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలు త్వరలోనే భారీగా అసెంబ్లీ సీట్లు పెరుగబోతున్నాయని చెపుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను తమతమ పార్టీలో చేర్చుకొంటున్నాయి. కొత్తవాళ్ళు వచ్చి ఎంతకంది వచ్చి చేరినా పాత వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండబోదని భరోసా ఇవ్వడానికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెపుతున్నారు. అయితే అదొక చిన్న ఆశ. ఆ ఆశతో పార్టీని చిరకాలంగా అంటిపెట్టుకొని ఉన్నవారికి చిన్న ఉపశమనం కల్పించే ప్రయత్నమేనని అందరికీ తెలుసు.
తెదేపా, తెరాసలు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష వలన తీవ్రంగా నష్టపోతున్న ప్రతిపక్షాలు అందుకు ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అవి పట్టించుకోవడం లేదు. వాటికి వైకాపా కనిపెట్టిన విరుగుడు ఏమిటంటే, 2026 వరకు రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరగవని నిరూపించి చూపడం. తద్వారా ఫిరాయింపులకి సిద్దపడుతున్న పార్టీ ఎమ్మెల్యేలని పునరాలోచించుకొనేలాగ చేసి, ఫిరాయింపులకి బ్రేకులు వేస్తూనే, అదే సమయంలో తెదేపా నేతలలో ఆందోళన మరింత పెంచవచ్చనేది దాని వ్యూహంగా కనిపిస్తోంది.
అందుకే వైకాపా మనసాక్షి ‘సాక్షి మీడియా’ సమాచార హక్కుని వినియోగించుకొంటూ జూన్ 26, 2014న కేంద్ర ఎన్నికల కమీషనర్ కి ఒక లేఖ వ్రాసింది. దానిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం భారత అటార్నీ జనరల్ నుంచి ఏదైనా న్యాయ సలహా కోరిందా? విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపును ఇప్పట్లో చేపట్టే ప్రతిపాదన ఏదైనా ఉందా? అని ప్రశ్నలు అడిగింది.
దానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిన్న సాక్షికి జవాబు అందింది. అందులో అటువంటి ఆలోచనలు, ప్రతిపాదనలు ఏవీ లేవని పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై రెండేళ్ళ క్రితం అంటే సెప్టెంబర్ 2014లో కేంద్ర మంత్రిత్వ శాఖలకు మాకు మధ్య కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి కానీ ఈ మధ్య కాలంలో అటువంటివేవీ జరుగలేదని తన లేఖలో పేర్కొంది. రాజ్యాంగంలోని170 (3) అధికరణ ప్రకారం 2026లో జనాభా లెక్కలు తీసి, అప్పటికి పెరిగిన జనాభాకి అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి అనుమతి ఉంది తప్ప ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని స్పష్టం చేసినట్లు ఎన్నికల సంఘం తన జవాబులో పేర్కొందని సాక్షి కధనంలో పేర్కొంది.
ఒకవేళ అదే నిజమనుకొంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ముగ్గురూ అబద్దాలు చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది. అది నిజమో అబద్ధమో కాలమే చెపుతుంది. కానీ సాక్షి చేసిన ఈ ప్రయత్నం వలన వైకాపా ఎమ్మెల్యేల వలసలు ఆగుతాయా? అంటే అనుమానమే.