ఏ.ఆర్.రెహమాన్ భారతీయ సినీ సంగీతానికి కొత్త ఒరవడి తీసుకొచ్చిన స్వర మేధావి. చిన్న వయసులోనే ఎవ్వరికీ సాధ్యం కాని విజయాల్ని అందుకొన్నాడు. వెస్ట్రన్ బీట్ లో… మనదైన స్వరాన్నీ సంగీతాన్ని మేళవించి అద్భుతాలు సృష్టించాడు. రెండు ఆస్కార్లు ఒకేసారి అందుకొని భారతజాతి మొత్తం పులకించేలా చేశాడు. రెహమాన్ సంగీతం అంటే.. ఆ సినిమా మ్యూజికల్లీ హిట్టే అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. అయితే కొంతకాలంగా రెహమాన్ మాయ మాయమైపోయింది. అతని సంగీతంలో కొత్తదనం కనిపించడం లేదు. ఆరు పాటలిచ్చినా ఒక్కటీ క్లిక్ అవ్వడం లేదు. తాగాగా 24 సినిమానే అందుకు నిదర్శనం.
సూర్య – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 24. టెక్నికల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉందంటున్నారంతా. కానీ.. రెహమాన్ మైనస్ అని విమర్శకులు సైతం వ్యతిరేక గళం విప్పుతున్నారు. పాటల్లో ఒక్కటీ క్యాచీగా లేదని, రెహమాన్ పాటొస్తే సినిమాలో తెలియని నీరసం ఆవహిస్తోందని.. సమీక్షలు సైతం చెబుతున్నాయి. అద్భుతమైన కెమెరా పనితనం, లొకేషన్లు కూడా రెహమాన్ పాటల్ని బతికించలేకపోతున్నాయి. రెహమాన్ పాటల్లో కిక్ తగ్గిపోయిందని అతని అభిమానులు సైతం అంటున్నారు. సడన్ గా రెహమాన్‌కి ఏమైంది? అతని పాటలు ఎందుకు పూర్వపు అనుభూతిని ఇవ్వడం లేదు.. అని సంగీతాభిమానులు కూడా చర్చించుకొంటున్నారు. రెహమాన్ సంగీతంపై తొలిసారి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పవన్ కల్యాణ్ పులికీ రెహమాన్ సంగీతం అందించారు. అందులో ఒక్కపాట కూడా వినసొంపుగా ఉండదు. తెలుగు పాటలంటే నిర్లక్ష్యం చేస్తాడని రెహమాన్‌పై అపవాదు ఉంది. ఇప్పుడు తమిళ సినిమాల్నీ తక్కువ చేసి చూస్తున్నాడన్నమాట.
రెహమాన్ మనసంతా హాలీవుడ్ సినిమాలపై పడిపోయిందని, అందుకే భారతీయ సినిమాల్ని తక్కువ చేసి చూస్తున్నాడని… అందుకే అతని సంగీతంలో పదును తగ్గిందని బాలీవుడ్ విశ్లేషకులు సైతం రెహమాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నేళ్లుగా భారతీయ ప్రేక్షకుల్ని తన సంగీతంతో ఉర్రూతలూగించిన రెహమాన్.. ఇప్పుడు మళ్లీ తనని తాను నిరూపించుకొనే, తనని తాను గెలిపించుకొనే సమయం ఆసన్నమైంది. మరి ఈసారి రెహమాన్ విమర్శకులకు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.