మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?? మహేష్ సినిమా అంటే… బాక్సాఫీసు దగ్గర కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. టాలీవుడ్లో అప్పటి వరకూ ఉన్న రికార్డుల్ని తిరగరాయగల సమర్థుడు మహేష్. ఓవర్సీస్ ప్రేక్షకులు మహేష్ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. శ్రీమంతుడు సాధించిన రికార్డు వసూళ్లే అందుకు సాక్ష్యాలు. క్రమంగా మహేష్ మైలేజీ తమిళనాడుకీ పాకింది. అక్కడ శ్రీమంతుడు మంచి వసూళ్లనే రాబట్టింది. బ్రహ్మోత్సవం కోసం కూడా తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పీవీపీ ఓవరాక్షన్ వల్ల.. బ్రహ్మోత్సవం అక్కడ విడుదల అవుతుందా, లేదా అనే విషయం సందిగ్థంలో పడింది.
శ్రీమంతుడు తమిళనాట రూ.5 కోట్ల వరకూ వసూలు చేసింది. బ్రహ్మోత్సవానికి అదే ఫలితం వచ్చే అవకాశం ఉంది. అక్కడి బయ్యర్లు రూ.5 కోట్లకు బ్రహ్మోత్సవం కొనడానికి రెడీ అయ్యారు. అయితే పీవీపీ మాత్రం రూ.8 కోట్లకు తగ్గేది లేదు అంటోందట. దాంతో… తమిళ బయ్యర్లు వెనకడుగు వేశారు. మరీ ఎక్కువ రేట్లు చెబుతుంటే.. అసలు బేరమాడడానికి కూడా తమిళ బయ్యర్లు ఉత్సాహం చూపించడం లేదు. వచ్చే వాళ్లు కూడా వెనకడుగు వేస్తుండడంతో.. ఇప్పుడు బ్రహ్మోత్సవం తమిళనాట విడుదల అవుతుందా, లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ.. బయ్యర్లు రాకపోతే ఈసినిమాని సొంతంగా విడుదల చేసుకోవడం మినహా మరో మార్గం లేదు.