అమెరికా అధ్యక్షా ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా చాలా తీవ్ర విమర్శలు చేసారు.ఆయన నిన్న తన అధికార నివాసం వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “డోనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికలని ఒక రియాల్టీ షోగా భావిస్తున్నట్లున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలను, చేస్తున్న వ్యాఖ్యలను చూసి రిపబ్లికన్ పార్టీ నేతలే చాలా బాధపడుతున్నారిప్పుడు. ఆయన వలన రిపబ్లికన్ పార్టీలో చీలిక ఏర్పడుతోంది. కనుక రిపబ్లికన్ పార్టీ అటువంటి అభ్యర్ధిని నిలబెట్టడంపై ఒకసారి పునరాలోచించుకొంటే బాగుంటుంది డోనాల్డ్ ట్రంప్ ఆకస్మిక రాజకీయ ఎదుగుదల యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ప్రస్తుతం మనం చాలా గంభీరమయిన సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటి పరిష్కారం కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. ఈ ఎన్నికలను ఒక టీవీ షోగా మార్చి ప్రజలను వినోదింపజేస్తున్న వారికి ఓటేయాలను కొంతున్నవారు ముందుగా ఆ వ్యక్తి శక్తి సామర్ధ్యాలు, వ్యక్తిగత, రాజకీయ, వ్యాపార ట్రాక్ రికార్డ్ అన్నిటినీ చాలా లోతుగా పరిశీలించడం చాలా అవసరం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్నన వ్యాఖ్యలపైనే కాదు..ఆయన గతంలో మాట్లాడిన మాటలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ వ్యక్తి మంచి చెడ్డలను బేరీజు వేసుకొన్న తరువాతనే తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారు అందుకు అన్నివిధాల సమర్ధులై ఉండాలి. కనుక ఆ పదవికి పోటీ పడుతున్న ప్రతీ వ్యక్తి గురించి చాలా లోతుగా పరిశీలించడం చాలా అవసరం. అప్పుడే అన్నివిధాల సమర్ధుడైన వ్యక్తిని గుర్తించిఎన్నుకోగలుగుతాము,” అని బారక్ ఒబామా అన్నారు.