బాలీవుడ్లో సరికొత్త వివాదాలకు తావిస్తున్న చిత్రం.. అజార్. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజార్ పాత్రని ఇమ్రాన్ హష్మీ పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై బోలెడన్ని వివాదాలు. ఇప్పుడు మరోటి మొదలైంది. ఈ సినిమాలో తన పాత్రని వక్రీకరించి చూపించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మాజీ క్రికెటర్లు. మరీ ముఖ్యంగా మనోజ్ ప్రభాకర్ ఈ సినిమాని తనకు చూపించకుండా విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తున్నాడు.
అజర్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు అందులో మనోజ్ ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. అజార్కి వ్యతిరేకంగా మనోజ్ సాక్ష్యం చెప్పి.. సంచలనం సృష్టించాడు, ఇప్పుడు ఆ పాత్రని నెగిటీవ్ కోణంలో చూపించబోతున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో.. మనోజ్ ప్రభాకర్ ఈ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నాడట. మరోవైపు అజర్ భార్య సంగీత బిజీలాని కూడా తన పాత్ర ఎలా ఉండబోతోందో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎవరైతే.. ఈ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారో వాళ్లందరికీ చిత్రబృందం స్పెషల్ షోని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విమర్శల్ని, వివాదల్ని కూడా అజర్ బృందం.. పబ్లిసిటీగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అజార్కి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చింది. మరి మున్ముందు ఇంకెన్ని వివాదాలు చెలరేగుతాయో చూడాలి.