మంత్రి గంటా శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో భాజపా, పవన్ కళ్యాణ్ ల గురించి ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. “కేంద్రం నుంచి వైదొలగడానికి మాకు ఒక్క నిమిషం పట్టదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేము తొందరపడటం లేదు. ఒకవేళ మాతో స్నేహం వద్దని భాజపా అనుకొంటే దాని వలన మా కంటే అదే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ భాజపాకి మద్దతు ఇస్తారనే ధీమా వారిలో ఉన్నట్లుంది కానీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా భాజపా ఒంటరిగా పోటీ చేస్తే ఎన్నికలలో గెలవడం అసాధ్యం. వచ్చే ఎన్నికలలో కూడా తెదేపాయే మళ్ళీ విజయం సాధించి అధికారం దక్కించుకోవడం తధ్యం. జగన్మోహన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నాయకుడు మాకున్నప్పుడు మా గెలుపు ఏకపక్షం అవుతుంది,” అని అన్నారు.
తెదేపా, భాజపాలు కలిసి కొనసాగుతాయా లేదా అనే విషయాన్ని పక్కనబెట్టి, రాష్ట్రంలో భాజపా ప్రస్తుత పరిస్థితిని ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు ఆమోదం లేనిదే పార్టీకి అధ్యక్షుడుని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉందది. తెదేపా-భాజపా సంబంధాలను ప్రభావితం చేసే ఆ నియామకంపై అందుకే భాజపా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. తెలంగాణా భాజపా నేతలలాగే రాష్ట్రంలో భాజపా నేతలు కూడా వాపును చూసి బలుపు అనుకొంటున్నారు.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్ని ఎంపి, ఎమ్మెల్యే స్థానాలకి నిలబెట్టడానికి భాజపా వద్ద సరిపోయినన్ని మంది అభ్యర్ధులు కూడా లేరు. ఒకవేళ వెతికి తెచ్చుకొన్నా, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి హామీలపై అది మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న తీరు కారణంగా ప్రజలు దాని పట్ల ఆగ్రహంగా ఉన్నారు కనుక ఘోర పరాజయం తప్పదు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో పరిస్థితులు వేడెక్కగానే రాష్ట్ర భాజపా నేతలు అందరూ కనబడకుండా మాయమైపోవడం గమనిస్తే వారు ఎటువంటి దుస్థితిలో ఉన్నారో అర్ధమవుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే, అప్పుడు తెదేపాతో పొత్తులు కొనసాగించినా, లేదా విడిపోయి ఒంటరిగా పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా, లేదా వైకాపాతో చేతులు కలిపినా భాజపా అభ్యర్ధులకు ఓట్లు పడే అవకాశం ఉండకపోవచ్చు. అంతే కాదు ఒకవేళ తెదేపాతో పొత్తులు కొనసాగించినట్లయితే, భాజపా ప్రభావం తెదేపాపై కూడా పడి అది కూడా ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక అటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి రాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలా అదుకొంటే భాజపాకే మంచిది.