అదే ఆట…అదే ఆటస్ధలం…ఆటగాళ్ళే అటూ ఇటూ మారారు…మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇది మౌనముని నరేంద్రమోదీ సాక్షిగా రచ్చగా మారిపోయిన చర్చల పార్లమెంటు. 2జి స్పెక్ట్రమ్మీద జాయింట్ పార్లమెంటరీ వేయాలని పట్టుబట్టిన బిజెపి 2011లో పార్లమెంటు శీతాకాలపు సమావేశాల్ని ఒక్కరోజు కూడా జరగనివ్వలేదు. నాలుగేళ్ళ తరువాత వర్షాకాలపు సమావేశాల్లో ఇపుడు కాంగ్రెస్ అదేపని చేస్తోంది. ఎవరెంతచెప్పినా సుష్మా, వసుంధర, చౌహాన్ లు రాజీనామా చేయరని పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ప్రధాని ప్రకటించేసి చేతులు కట్టుకుని కూర్చున్నారు.
ఐదురోజులపాటు సస్పెండయిన కాంగ్రెస్ ఎంపీలకు సంఘీభావంగా తామూ సభకు వెళ్ళేది లేదని 9 ప్రతిపక్షాలూ ప్రకటించడం కాంగ్రెస్ నైతిక బలాన్ని పెంచింది. సభనియమనిబంధనలను తాను రాయలేదని ఎప్పటినుంచో వున్నవాటినే అమలు చేస్తున్నానని స్పీకర్ చర్యను సమర్ధించుకుంటే, సభను నడవనీయకపోవడం తానుపెట్టిన సాంప్రదాయం కాదని, ”రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు” అని ప్రభోధించింది బిజెపి యేనని సోనియా దెప్పిపొడిచారు.
చట్టసభలో బాధ్యతా యుతమైన చర్చలకంటే, రెండునెలల్లో బీహార్ ఎన్నికలు జరుగుతూండగా మెట్టుదిగినట్టు కనిపించకపోవడమే పాలక, ప్రతిపక్షాలకు ముఖ్యం. సభను సజావుగా సాగనివ్వండి ప్రధానే సమాధానం చెబుతారు అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంప్రదించినా సోనియా ససేమిరా అన్నారంటే తాడు తెగిపోయినా సరే సాగలాగడమే కాంగ్రెస్ ధోరణిగా స్పష్టమైంది.
అధికార దుర్వినియోగానికి , ఆశ్రిత పక్షపాతానికి మించి నిందితుడైన లలిత్ మోడీని విదేశీపర్యటనకు అనుమతించవలసిందిగా మరొకదేశాన్ని ఒక కేంద్రమంత్రి స్వయంగా కోరి దేశం పరువుప్రతిష్ఠలను దిగజార్చిన అంశం. అందుకు పాల్పడిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ”నేనేమీతప్పుచేయలేదని” పొడిపొడిగా సమాధానంచెప్పి తప్పుకోవడానికి సడలని కాంగ్రెస్ పట్టే కారణమైతే, రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు అనే ఎత్తుగడను అప్పట్లోనే అమలు చేసిన బిజెపి యే మార్గదర్శి.