వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీకి స్థిరమైన ఇమేజి ఇవ్వడానికి, ఏదో తమ దుకాన్ బంద్ అనే భావన ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ ఇమేజిని కాపాడుకోవడానికి జగన్ ఆరాటపడుతున్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకోవడం, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా పార్టీని గులాబీలో విలీనం చేసేసిన తర్వాత.. ఇక శల్యావశిష్టంగా మిగిలిన పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ వైకాపా కు కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు.
పొంగులేటి పార్టీని వీడి వెళ్లిపోతారని వార్తలు వచ్చిన సమయంలోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసి వెంటనే మరొకరిని పార్టీ అధ్యక్షుడు చేసి ఉంటే.. పార్టీకి చాలా పరువుగా ఉండేది. ఖరారుగా నేతలు ఫిరాయిస్తున్నారని తెలియగానే ఏ పార్టీ అయినా ఇలాంటి చర్యలే తీసుకుంటుంది. అయినా జగన్మోహనరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనించి అందరూ ఆయన ఇక టీ వైకాపా మీద శ్రద్ధ వదిలేశారని అనుకున్నారు. పొంగులేటి వెళ్లిపోయిన తర్వాత.. పార్టీకి కొత్త కార్యవర్గం ప్రకటన కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చునని విశ్లేషకులు భావించారు.
అయితే వారి ఊహలకు భిన్నంగా రెండురోజుల వ్యవధిలోనే జగన్ కొత్త కార్యవర్గం వేశారు. కొత్త టీవైకాపా అధ్యక్షుడుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కృష్ణారెడ్డి, కె. శివకుమార్ ఉంటారు. కార్యవర్గం వరకు ఓకే.. మరి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి షర్మిలనుకూడా మళ్లీ రంగంలోకి దించుతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది.