ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో కొద్ది వారాలుగా చంద్రబాబునాయుడుకు జగన్ ఫోబియా పట్టుకున్న మాట వాస్తవంగా కనిపిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్ దీక్షను ప్రకటించిన వెంటనే తాను కూడా రంగంలోకి దిగవలసిన ఆవశ్యకత చంద్రబాబుకు తెలిసి వచ్చింది. ఆయన కూడా ఏదో కేబినెట్ తీర్మానం చేసినట్లుగా, పార్టీ పాలిట్‌బ్యూరోలో చర్చించినట్లుగా కాస్త హడావుడి చూపించే ప్రయత్నం చేశారు. అలాగే బ్రాండిక్స్ కార్మికుల కోసం జగన్ అక్కడకు వెళ్లి దీక్షకు మద్దతు ఇవ్వగానే.. మంత్రి రంగంలోకి దిగి నెలలోగా కార్మికులు కోరినట్లుగా జీతాలు సవరించేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తాం అంటూ దిగివచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కూడా జగన్ ఉద్యమిస్తున్నారు తప్ప చంద్రబాబు ఇంకా డొంకతిరుగుడు మాటలే చెబుతున్నారు. ఇలా అనేక రకాలుగా… జగన్ రూపేణా వస్తున్న ఒత్తిడికి చంద్రబాబునాయుడు తలొగ్గవలసి వస్తోంది. అయితే ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆయన జగన్‌కే ఒక సలహా ఇస్తున్నారు.
ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూలులో జగన్ చేపట్టదలచుకున్న దీక్షను చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారు. జగన్ దీక్ష చేయవలసింది కర్నూలులో కాదు, ఢిల్లీలో అంటూ చంద్రబాబు ఓ ఉచిత సలహా కూడా పారేస్తున్నారు. చంద్రబాబు సలహా నిజమే కావొచ్చు.. కృష్ణా జలాల పంపకం విషయాన్ని, పాలమూరు ప్రాజెక్టు వలన రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా మాత్రమే న్యాయం జరగవచ్చు గాక! అయితే అచేతనంగా ఉండడం కంటె ఏదో ఒక చోట పోరు బాటను ప్రారంభించడమే మంచిది కదా!
చంద్రబాబు ఇచ్చిన సలహాను జగన్ ఆచరించాడనే అనుకుందాం. అచ్చంగా చంద్రబాబు చెప్పినట్లే.. వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్షకు కూర్చుంటే గనుక, రాజకీయాలను పక్కన పెట్టి దానికి మద్దతు ఇవ్వగల తెగువ చంద్రబాబునాయుడుకు ఉందా? రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా నాయకులను కూడా జగన్ దీక్షలో పాల్గొనేలా పంపగలిగేంత సహృదయత చంద్రబాబునాయుడు వద్ద ఉన్నదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష నేత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దీక్ష చేస్తున్నప్పుడు, దానిని గేలి చేయడం కాదు, అదే ప్రయోజనం కోసం తామెంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అనేది కూడా పాలకులు గుర్తించుకోవాలి. లేకపోతే జనానికి న్యాయం జరగదు.