కాంగ్రెస్, వైకాపాలు రెండూ వేర్వేరు రాజకీయ పార్టీలు. వాటి మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. అవి రాజకీయాలలో సమాంతరంగా పయనిస్తున్నాయని అందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డికి కొన్నిసార్లు మార్గదర్శనం చేస్తున్నట్లు కనబడుతోంది. ఆయన ప్రత్యేక హోదా గురించి సుమారు ఏడాదిపాటు మాట్లాడనే లేదు. ఓసారి రాహుల్ గాంధీ అనంతపురం వచ్చినప్పుడు, హోదాపై వైకాపా ఎందుకు పోరాడటం లేదు? అని ప్రశ్నించగానే, జగన్మోహన్ రెడ్డి దానిపై తక్షణం పోరాటం మొదలుపెట్టేశారు. అంతవరకు ప్రత్యేక హోదా కోసం చాలా హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, జగన్ దానిని అందుకోగానే ఆయనకి దాని పూర్తి అడ్వాంటేజ్ దక్కాలన్నట్లుగా వెనక్కి తగ్గింది. కానీ జగన్ మొదలుపెట్టిన పోరాటం చివరికి తుస్స్ మంది. ఆ తరువాత మళ్ళీ నిన్న మొన్నటివరకు దాని ఊసే ఎత్తలేదు.
మళ్ళీ రాజ్యసభలో కెవిపి రామచంద్ర రావు దాని కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానిపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్రమంత్రులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంచెం హడావుడి చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ లీడ్ అందించినట్లుంది. దానిని అందుకొని జగన్ మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మొదలుపెట్టేశారు. దాని కోసం పోరాడుతున్న వారెవరికీ తను మద్దతు ఈయకపోయినా, తను మొదలుపెడుతున్న ఈ పోరాటానికి తన బద్ధ శత్రువయిన తెదేపా కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే ఆంధ్రాని మోసం చేస్తున్నట్లే లెక్క అని తేల్చి చెప్పారు.
రాష్ట్రం కోసం వైకాపా పోరాడటం అభినందనీయమే. కానీ మొదట ఒక ఏడాది పాటు దాని గురించి జగన్ మాట్లాడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? దాని కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ముగించిన తరువాత మళ్ళీ నిన్న మొన్నటి వరకు దాని గురించి ఎందుకు పోరాడలేదు? మళ్ళీ ఇప్పుడే ఎందుకు పోరాడాలనుకొంటున్నారు? ఇప్పుడు మొదలుపెటడుతున్న ఈ పోరాటాన్ని ప్రత్యేక హోదా సాధించేవరకు కొనసాగిస్తారా లేక ఓ మూడు నాలుగు రోజులు హడావుడి చేసి మళ్ళీ దానిని పక్కన పడేస్తారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.