తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ద్వారా రావాల్సిన దేని గురించి అడిగినా సరే.. ఇదిగో అదిగో వచ్చేస్తోంది.. దాని గురించి సంబంధిత మంత్రిత్వ శాఖతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది, ఫైలు తయారైంది.. అంటూ రకరకాలుగా మాటలు వల్లించడంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిట్ట. తనను ఎవరు ఎంత గొప్పగా ఇరుకున పెట్ట దలచుకున్నప్పటికీ.. మాటల డాంబికంగా డబాయించేసి బయటపడడంలో ఆయనను మించిన వారు లేరు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయదలచుకున్నారా లేదా? కనీసం సభాముఖంగా తెలుగు ప్రజలు అందరూ చూస్తూ ఉండగా తాను చెప్పిన మాటలకు అయినా ఆయన కట్టుబడి ఉన్నారా లేదా? ఎప్పటికీ నిశ్చింతగా ప్రజల ముందు డ్రామాలు ఆడుతూ ఉండవచ్చునని , వారు గుర్తించేది ఉండదని ఆయన ఫిక్సయ్యారా? అనేది ఇప్పుడు తేలిపోనుంది.
తెలుగు రాష్ట్రం విభజనకు సంబంధించిన బిల్లును ఆమోదం కోసం రాజ్యసభ ఎదుటకు తెచ్చినప్పుడు ప్రత్యేకహోదా అంశం ప్రధానంగా అడ్డుపడింది. అప్పటి కాంగ్రెస్ సర్కారు ఏపీకి అయిదేళ్లపాటూ ప్రత్యేకహోదా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే.. అనాథలా ఏర్పడబోయే రాష్ట్రానికి అయిదేళ్ల ప్రత్యేకహోదా ఏం సరిపోతుందని, కనీసం పదేళ్లు ప్రత్యేకహోదా ఉండాల్సిందేనని అంటూ వెంకయ్యనాయుడు అప్పట్లో గొంతు చించుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమేరకు ప్రకటన చేసిన తర్వాత మాత్రమే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.
ప్రధాని ప్రకటన సాధించడం వెనుక తానే ఎంతో కీలకంగా వ్యవహరించానంటూ ఆ తర్వాత అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు తన గురించి తాను డప్పు కొట్టుకున్నారు. తీరా అసలు ఏపీ ప్రయోజనాలను సాధించడం పట్ల ఆయనలో నిజంగా ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయే సందర్భం వచ్చింది. రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లు ఈనెల 13న ఓటింగ్‌కు రానుంది. ఈ ఓటింగ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కేవీపీ, ప్రత్యేకహోదా ఒకప్పటి ఉద్యమకారుడు వెంకయ్యనాయుడుకు కూడా లేఖ రాశారు. కేవీపీ బిల్లును వెంకయ్య గేలిచేస్తున్న నేపథ్యంలో.. వెంకయ్య మద్దతు కోసం కేవీపీ లేఖ రాయడం విశేషం. మరి వెంకయ్య తన చిత్తశుద్ధిని చాటుకుంటారో.. మళ్లీ ఏదైనా మాయమాటలతో జనాన్ని బురిడీ కొట్టిస్తారో చూడాలి.