తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డికి రాజకీయ వర్గాల్లో సీనియర్ నాయకుడిగా, ప్రాక్టికల్‌గా ఉండే నాయకుడిగా, రాజకీయాలకు అతీతంగా.. కేసీఆర్ సర్కారు మంచిపని చేస్తే ఖచ్చితంగా దానిని అభినందించే ప్రతిపక్షనాయకుడిగా జానారెడ్డికి గుర్తింపు ఉంది. అందుకే జానారెడ్డి మాటలకు శాసనసభలో పాలకపక్షంలోని పెద్దలు కూడా ఎంతో విలువ ఇస్తారు. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జానారెడ్డి ఇప్పుడు తెలంగాణలో నిర్మాణానికి పురుడు పోసుకుంటున్న నీటి ప్రాజెక్టుల గురించి, వాటి భవిష్యత్తు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖలోని కొన్ని సంగతులు, కేసీఆర్ పరిగణనలోకి తీసుకుంటే గనుక.. ఏపీ ప్రయోజనాలకు కూడా గరిష్టంగా మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల రీ డిజైనింగ్ విషయంలో కాంగ్రెసు మొత్తం వ్యతిరేకించినా, జానారెడ్డికి భిన్నాభిప్రాయాలు లేవు. అయితే ఆయన ఇప్పటికే సగంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను తొలుత పూర్తిచేసిన తర్వాతనే కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లాలని హితవు చెబుతున్నారు. పాలమూరు- రంగారెడ్డి , దిండి ఎత్తి పోతల ప్రాజెక్టుల విషయంలోనూ జానారెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కృష్ణాజలాల తుది కేటాయింపులు ఖరారయ్యే సమయానికి తెలంగాణకు దక్కే నీటి వాటాలు ఇప్పటి అంచనాలకంటె పూర్తిగా మారిపోవచ్చునని, అలాంటప్పుడు ఈ అంచనాల ప్రకారం కట్టే ఎత్తిపోతల ప్రాజెక్టులు వృథా అవుతాయని జానా సూచిస్తున్నారు. ఒక రకంగా ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు కృష్ణా జలాల బోర్డు అనుమతులు వచ్చే వరకు, వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వరకు ప్రాజెక్టుల జోలికి వెళ్లద్దు అని సూచిస్తున్నట్లుగానే ఉంది. నిజానికి పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించే ఆంధ్ర నాయకులందరూ కోరుకుంటున్నది ఇదే.
టీ నేతలు కూడా అదే మాట చెబుతున్న నేపథ్యంలో ఆంధ్ర నేతలను నిత్యం తిడుతూ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని అరచి గీపెట్టే కేసీఆర్, హరీశ్ తదితరులు ఇప్పటికైనా పద్ధతిగా ఆలోచించి, జానారెడ్డి సూచనలోని వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం వారు చేస్తున్న ప్రాజెక్టుల ఆలోచనల వల్ల కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే తప్ప అటు ఏపీకి నష్టంతో పాటు, తమ రాష్ట్రానికి కూడా నష్టమేననే సంగతిని వారు తెలుసుకోవాలి.