ప్రత్యేక హోదా గురించి ఓ మూడు నాలుగు రోజులు ప్రతిపక్షాలతో కలిసి కేంద్రాన్ని ఏకేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్ళీ యధా ప్రకారం ‘కేంద్రంతో గొడవలు వద్దు.. స్నేహంగా ఉంటూనే అన్నీ సాధించుకొందాము.. తెదేపా, భాజపాలు విడిపోవాలనే వైకాపా కోరిక ఎన్నటికీ నెరవేరదు,’ వంటి రొటీన్ డైలాగులతో ఈ ఎపిసోడ్ కి ముగింపు పలికారు. వెంటనే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు ఆయనకి కోరస్ పాడారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా కోరస్ పాడి కేంద్రంతో తెగతెంపులు తెంపులు చేసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్షాలు పరిష్కార మార్గం (?)లో పోరాడకుండా కేంద్రాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని, దాని వలన రాష్ట్రానికి రావలసిన నిధులు రావని కనుక తెదేపా కేంద్రంతో స్నేహంగా ఉంటూనే అన్నీ సాధించుకొంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిరంతర ఒత్తిడి తెస్తూ ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఇద్దరు కేంద్ర మంత్రులు పార్లమెంటులో లిఖితపూర్వకంగా చెప్పేసిన తరువాత కూడా కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ దాని కోసం ఒత్తిడి తెస్తామని అయ్యన్న చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని వైకాపా కోరుతోంది తప్ప ప్రజలేమీ కోరడం లేదు. కానీ ప్రజలే కోరుతున్నట్లు తెదేపా ఊహించుకొంటోంది. ప్రత్యేక హోదా తదితర హామీలను సాధించుకోలేకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు భాజపాతో సహా తెదేపాను కూడా ఎక్కడ తిరస్కరిస్తారో అనే భయం వారిలో ఉంది. అందుకే తెదేపా నేతలు ప్రజల ‘ఇగో’ని సంతృప్తి పరిచేందుకు అప్పుడప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తుంటారు..
ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం మొన్న కేంద్రమంత్రులు ఇద్దరూ చెప్పే వరకు ప్రజలకి తెలియదనుకొంటే అవివేకమే. కానీ కేంద్రంతో ఉన్న అవసరాలు, భాజపాతో పొత్తులను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి దాని గురించి కేంద్రాని గట్టిగా నిలదీయకుండా, హోదా రాదనే సంగతి ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతూ, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతూ రెండేళ్ళు దొర్లించేసారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెపుతున్నా కూడా దాని కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటామని అయ్యన్న పాత్రుడు చెప్పడానికి అర్ధం ఏమిటంటే మిగిలిన మూడేళ్ళు కూడా ఇలాగే కాలక్షేపం చేసేస్తామని! ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక నిరభ్యంతరంగా కాలక్షేపం చేసుకోవచ్చు. కానీ 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు దాని గురించి సంజాయిషీలు ఇచ్చుకోవడం చాలా కష్టమనే సంగతి గ్రహిస్తే చాలు.