ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విమర్శించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరీ అయితే మోడీని ఘాటుగా విమర్శించారు. ఇంతాచేసి, ఓ విషయంలో మోడీకి ఘనమైన సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
మోడీ నిరంకుశంగా పాలిస్తున్నారని శౌరీ ఆరోపించారు. ప్రధాన మంత్రిగా కాకుండా అధ్యక్షుడి తరహాలో ఏకఛత్రపాలన సాగిస్తున్నారని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో దుయ్యబట్టారు. అనేక విషయాల్లో మోడీ విఫలమయ్యారని విమర్శించారు.
అతి కొద్ది మంది కోటరీ సభ్యుల మాటలనే మోడీ వింటున్నారు. వాళ్లు నిజాలు చెప్పడం లేదు. కాబట్టి నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారనేది మోడీకి తెలియడం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో మోడీ మాటకు ఎదురు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నియంత తరహాలో పనిచేస్తున్నారని ఆరోపించారు.
చైనా విషయంలో నెహ్రూ చేసిన తప్పునే మోడీ చేశారని దుయ్యబట్టారు. వీరిద్దరూ చైనాను దారికి తేగలమని భ్రమపడి విఫలమయ్యారని విమర్శించారు. వాజ్ పేయి జమానాకు, మోడీ పాలనకు చాలా తేడా ఉందన్నారు. ఇంకా అనేక విమర్శలు గుప్పించారు.
ఇంతా చేసి, మోడీకి ఒక విషయంలో మాత్రం మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. మోడీ పాలనలో కేంద్రంలో అవినీతి గణనీయంగా తగ్గిందన్నారు శౌరీ. మోడీ పాలన అవినీతి రహితంగా ఉందని చాలా మంది అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో గట్టిగా వ్యవహరించకపోయినా, ఏపీ వంటి రాష్ట్రాలకు చేయాల్సిన సహాయం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తినా, అవినీతి రహిత పాలన విషయంలో మాత్రం మోడీకి ఫుల్ మార్కులే పడుతున్నాయి. మిగతా విషయాల్లో మోడీపై దుమ్మెత్తి పోసే వాళ్లు కూడా అవినీతిని వీలైనంత వరకు అరికట్టారని ఒప్పుకుంటున్నారు. ఇదొక్కటే మోడీకి కాస్త ఊరటనిచ్చే విషయం.
రాష్ట్రాలకు చేయాల్సిన సహాయం సరిగ్గా చేస్తే అక్కడి ప్రజల మనన్నలు కూడా పొందవచ్చు. ఆ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడవచ్చు. ప్రతిరోజూ నిధుల కోసం ఎదురు చూడకుండా ఏపీ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టవచ్చు. కాబట్టి ఈ విషయంలో అయినా మోడీ వీలైనంత త్వరగా కళ్లు తెరుస్తారేమో చూద్దాం.