ఆర్థికంగా అటు సంపన్నులుగానీ ఇటు పేదలుగానీ కాని వాళ్లు మధ్యతరగతి జీవులు. సామాజికంగా అగ్రవర్ణాలు గానీ దళితులు గానీ కాకుండా మధ్యలో ఉన్న వాళ్లు బీసీలు. ఉత్తరాది వారి భాషలో ఇతర వెనుకబడిన తరగతుల వారు. తెలంగాణ శాసనసభలో తెలుగు దేశం సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఇప్పుడు బీసీల కోసం కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ఇందుకోసం సినీనటుడు పవన్ కల్యాణ్ తో కూడా మాట్లాడారట. ఇప్పుడున్న పార్టీలన్నీ బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకుని మోసం చేస్తున్నాయనేది ఆయన ఆరోపణ. మరి దీనికి పవన్ కల్యాణ్ తో మాట్లాడటం ఎందుకనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ తరపున ప్రచారం చేసిన క్యాంపెయిన్ స్టార్ గా ముద్ర పడ్డారు. రేపు కొత్త పార్టీకి కూడా ఆయనే ప్రచారం చేసి పెడతారా లేక ఏవైనా సలహాలు మాత్రం ఇస్తారా అనేదానిపై స్పష్టత లేదు.
ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంది. అయితే, తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, 2014లో ఎల్ బి నగర్ టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ సంగతి ఏమిటి? ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రను గమనిస్తే, బీసీల బలమైన మద్దతుపొందిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ హయాంలో ఆయన సామాజికవర్గం కంటే బీసీలే ఎక్కువగా టీడీపీకి అండగా నిలిచారంటారు పరిశీలకులు.
బీసీలు ఎన్టీఆర్ హయాంలో లభించినంత ప్రాధాన్యం మరే నాయకుడి హయాంలోనూ లభించలేదని టాక్. ప్రస్తుతం తెరాస ఆపరేషన్ ఆకర్ష వల్ల టీడీపీ బలహీన పడింది. అయినా, ఉన్నంతలో బీసీలే ఆ పార్టీకి బలమైన కేడర్ గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పెట్టే పార్టీకి బీసీల ఆదరణ ఎంతవరకూ లభిస్తుందో చూడాలి. ఇప్పటికే బీసీల్లో అత్యధికులు ఏదో ఒక పార్టీకి విధేయులుగానో కార్యకర్తలుగానో ఉన్నారు. తటస్థంగా ఉన్నవాళ్లు తక్కువ. కాబట్టి ఒక పార్టీలో ఉన్న వారందరినీ ఆయన తనపార్టీలోకి ఆకర్షించగలరా అనేది ప్రశ్న.
బీసీ సంఘ నాయకుడిగా ఆయన కొందరికి సుపరిచితుడు. అయితే బీసీలందరికీ బాగా తెలిసిన నాయకుడు కాదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు బలమైన ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు భావిస్తాయి. నిజమే. కానీ ఆర్ కృష్ణయ్య ఇంత పెద్ద సామాజిక వర్గానికి ఏకైక నాయకుడిగా ముద్ర పడేలా చక్రం తిప్పగలరా అనే విషయంలో అనుమానాలున్నాయి. ఎవరో కొందరు పార్టీలో చేరినంత మాత్రాన అది బలమైన బీసీ పార్టీ కాలేదు. అనర్గళంగా ప్రసంగిస్తూ ప్రజలను ఆకర్షించే శక్తి ఆయనకు అంతగా లేదు. కాబట్టి కేడర్ బలంతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి. మరి బలమైన కేడర్ రావాలంటే ఆయన తమను ఉద్ధరిస్తారని బీసీలు, ముఖ్యంగా యువత నమ్మాలి. అలా నమ్మించగలిగే సత్తా ఆయనలో ఎంత ఉందో కాలమే చెప్పాలి.